హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): లోక్‌సభ ఎన్నికలకు దాదాపు మూడు నెలల ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలని బీజేపీ నిర్ణయించింది. సంక్రాంతిలోపే రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లో కనీసం సగం సీట్లకు అభ్యర్థులను ప్రకటించాలని భావిస్తున్నది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులు దొరక్కచివరి నిమిషం వరకు పేర్లు ప్రకటించుకుంటూ పోయారు. ఫలితంగా రికార్డు స్థాయి సీట్లలో డిపాజిట్లు కోల్పోయింది. ఈ అనుభవంతో లోక్‌సభ ఎన్నికలకు సంక్రాంతి నాటికే అభ్యర్థులను ప్రకటించాలని గురువారం జరిగిన రాష్ట్ర స్థాయి సదస్సు, అమిత్ షాతో జరిగిన రహస్య సమావేశంలో చర్చకు వచ్చినట్టు తెలిసింది. సోయం బాపూరావు, అర్వింద్, బండి, కిషన్‌రెడ్డికి టికెట్ ఖాయమని చెప్తున్నారు. సోయం కాంగ్రెస్‌కు వెళ్లిపోతారనే వార్తల నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్‌కు ఇవ్వొచ్చని వినిపిస్తున్నది. కరీంనగర్ టికెట్ తనకు ఇవ్వాలని ఈటల రాజేందర్ అడుగుతున్నట్టు సమాచారం.
మహబూబ్‌నగర్ కోసం జితేందర్‌రెడ్డి, డీకే అరుణ గట్టిగా ప్రయత్నిస్తున్నారట. ఈసారి బీసీకి టికెట్ ఇవ్వాలని తల్లోజు ఆచారి డిమాండ్ చేస్తున్నట్టు తెలిసింది. చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, భువనగిరి నుంచి బూర నర్సయ్యగౌడ్, ఖమ్మం నుంచి పొంగులేటి సుధాకర్‌రెడ్డి, వరంగల్ నుంచి చాడ సురేశ్‌రెడ్డి, కాళీప్రసాద్ పేర్లు వినిపిస్తున్నాయి. జహీరాబాద్ నుంచి పోటీ చేయాలని చికోటి ప్రవీణ్, అలె భాస్కర్ ప్రయత్నిస్తుండగా, తాజాగా వ్యాపారవేత్త ఏలేటి సురేశ్‌రెడ్డి పేరు తెరమీదికి వచ్చింది. మల్కాజిగిరి కోసం మురళీధర్‌రావు, రాంచందర్‌రావు, సామ రంగారెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి.