హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్, అస్సాంలో ప్రజలు ఇప్పటికీ ఆకలితో అలమటిస్తున్నారని అంగీకరించారు. న్యూజెర్సీ (అమెరికా)లోని ఓ ప్రవాస భారతీయుడి ఇంట్లో ఆమె మాట్లాడుతూ.. దక్షిణాది రాష్ర్టాలతో పోలిస్తే యూపీ, అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్ లాంటి ఉత్తరాది రాష్ర్టాల్లో పేదరికం చాలా అధికంగా ఉన్నదని పేర్కొన్నారు. దక్షిణాదిలో ఇలాంటి దుస్థితి లేదన్నారు. ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదిలో పరిస్థితి చాలా మెరుగ్గా ఉన్నదని, ఈ రాష్ర్టాల్లో ఆకలితో అలమటించే గ్రామం కనీసం ఒక్కటి కూడా లేదని తెలిపారు. దక్షిణ భారత దేశంలో అన్నానికి ఢోకా లేదని, ఆకలితో పస్తులుండాల్సిన దుస్థితి లేదని అన్నారు. దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాది రాష్ర్టాల్లో వెనుకబాటుతనం చాలా ఎక్కువగా ఉన్నదని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.