హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని, లేదంటే గద్దె దిగిపోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉత్త మాటలతో ప్రజలకు న్యాయం జరుగదని, ఇచ్చిన హామీలు అమలు చేయాలని సీఎంకు చురకలంటించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో తొందరపడి ఓటేశామా? అని ఇప్పటికే ప్రజలు ఆలోచనలో పడ్డారని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందంటూ కాంగ్రెస్ గోబెల్స్ ప్రచారం చేస్తున్నదని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్నదని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనో, రాహుల్ సమర్థ నాయకుడనో, సోనియాగాంధీ భారత్‌లో పుట్టిందనో, ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నామనో చెప్పి ఓట్లడిగే పరిస్థితిలో లేడని, అందుకే అసత్య ప్రచారం చేస్తున్నాడని ఎద్దేవా చేశారు.
వారు చేస్తున్న ప్రచారానికి సాక్ష్యాలు చూపాలని డిమాండ్ చేశారు. సిద్దిపేటలో అమిత్ షా మాటలను కాంగ్రెస్ మార్ఫింగ్ చేసిందని, దీనిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు. బీసీ రిజర్వేషన్లను నీరుగార్చిందే కాంగ్రెస్ అని మండిపడ్డారు. మతపరమైన రిజర్వేషన్లను అమలు చేస్తూ బీసీలకు విద్య, వైద్యాన్ని అందకుండా చేస్తున్నదని విమర్శించారు.