హనుమకొండ : ప్రధాని మోదీ మాకు దేవుడు కానే కాదు. తెలంగాణకు పట్టిన శని, దరిద్ర్యం ఏదైనా ఉందా అంటే.. ఈ భారతీయ జనతా పార్టీ అని చెప్పక తప్పదు అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్పారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో రూ. 125 కోట్లతో పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు శంకుస్థాపనలు చేసిన సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ ప్రసంగించారు.
ఈ ఎనిమిదిన్నరేండ్లలో కేంద్రం మాటలు చెప్పడం తప్ప.. తెలంగాణకు ఒక్క పైసా పని చేయలేదు అని కేటీఆర్ స్పష్టం చేశారు. జన్ ధన్ ఖాతాలు ఓపెన్ చేసి రూ. 15 లక్షల నగదు జమ చేస్తామని 2014లో మోదీ చెప్పాడు. పంద్రాహ్ లాక్ అన్నడు.. ఇంత వరకు పత్తా లేడు. రైతుల ఆదాయం డబుల్ చేస్తానని చెప్పాడు. ఒక్క రైతు ఆదాయం కూడా డబుల్ కాలేదు. ఈ దేశంలో ఎవరి ఆదాయం డబుల్, ట్రిబుల్ అయిందంటే.. 1300 రెట్లు పెరిగిందంటే ఒక్కటే ఒక్కడిది అని కేటీఆర్ తెలిపారు.
వాళ్ల దోస్తును పెద్దోన్ని చేయాలి. అండ్ల కెళ్లి వాళ్ల పార్టీకి చందా తీసుకోవాలి. ఓట్లను, ఎమ్మెల్యేలను కొనాలి. ప్రభుత్వాలను పడగొట్టి, పార్టీలను చీల్చే పని పెట్టుకున్నారు అని కేటీఆర్ పేర్కొన్నారు. ఇదే పని తప్ప.. ఇంకొక పని లేదు అని ధ్వజమెత్తారు. ఢిల్లీల ఉన్నోళ్లు ఫేకుడు.. ఇక్కడ ఉన్నోళ్లు జోకుడు. మోదీ కష్టపడి కరోనా వ్యాక్సిన్ కనుగొన్నాడని ఒకాయన అంటాడు. మరి శాస్త్రవేత్తలంతా గడ్డి కోసిండ్రా..? ఇలా మాట్లాడే కిషన్ రెడ్డిని మనం ఏమనుకోవాలి..? శవం వెళ్తే మీది.. శివం వెళ్తే మీది..? అని ఎంపీ సంజయ్ అంటాడు. మోదీ దేవుడు అని అంటాడు. సిలిండర్ ధర పెంచినందుకు ఆడబిడ్డలకు దేవుడా? పెట్రోల్ రేట్లు పెంచినందుకు మా తమ్ముళ్లకు దేవుడా..? రైతులను చంపినందుకు మోదీ దేవుడా? అని కేటీఆర్ నిలదీశారు.
కాజిపేటకు కోచ్ ఫ్యాక్టరీ, ములుగులో ట్రైబల్ యూనిర్సిటీ, నవోదయ విద్యాలయాలు, కొత్త విశ్వవిద్యాలయాలు, మెడికల్, నర్సింగ్ కాలేజీలు ఇవ్వనందుకా దేవుడా..? అని కేటీఆర్ ప్రశ్నించారు. అయితే నీకు, అదానీకి దేవుడు కావొచ్చు. మాకు మాత్రం ఈ ప్రధాని దేవుడు కానే కాదు. తెలంగాణకు పట్టిన శని, దరిద్ర్యం ఏదైనా ఉందా అంటే.. ఈ భారతీయ జనతా పార్టీ అని చెప్పక తప్పదు అని కేటీఆర్ స్పష్టం చేశారు. ఎక్కువ మాట్లాడితే ఈడీ, సీబీఐ వంటి సంస్థలను ఉసిగొల్పి కేసులు పెట్టేలా రాజకీయాలు చేస్తున్నారు. భయపడేది లేదు. తెలంగాణ ఉద్యమంలో ఆనాడు ఇదే వరంగల్ జిల్లాలో జైలకు పోయి వచ్చినోళ్లం మేం. ఎవరికీ భయపడం, ఎంతటికైనా పోరాడుతాం అని విజ్ఞప్తి చేస్తున్నాం అని కేటీఆర్ అన్నారు.