Grok Talk | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటువేసే అంశంపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్దఎత్తున చర్చ జరుగుతున్నది. బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయంలో స్పీకర్ జాప్యం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయమై తెలంగాణ స్పీకర్‌పై ఇప్పటికే సుప్రీంకోర్టు పలుసార్లు ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘పదవీకాలం ముగిసేంత వరకు నిర్ణయం తీసుకోరా? ఇలాగైతే ప్రజాస్వామ్య విలువలు ఏం కావాలి?’ అంటూ ధర్మాసనం ప్రశ్నించింది. ఈ క్రమంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి ఏఐ చాట్‌బాట్ ‘గ్రోక్’ను పలువురు నెటిజన్లు ప్రశ్నించారు. ఫిరాయింపులను ప్రోత్సహించి ప్రభుత్వాలను కూల్చడంలో ఏ పార్టీ ముందున్నదని అడిగారు. దీనిపై స్పందించిన గ్రోక్ ‘బీజేపీ’ అంటూ సమాధానమిచ్చింది. అలాగే, ఆర్టికల్ 356ని వందసార్లకు పైగా ప్రయోగించిన ఏకైక పార్టీగా కాంగ్రెస్ నిలిచిందని గ్రోక్ పేర్కొనడం వైరల్‌గా మారింది.
ప్రశ్న: ఫిరాయింపులను ప్రోత్సహించి ప్రభుత్వాలను పడగొట్టడంలో దేశంలో ఏ పార్టీ ముందున్నది?
గ్రోక్: ఫిరాయింపులను ప్రోత్సహించడంలో తద్వారా ప్రభుత్వాలను పడగొట్టడంలో బీజేపీ ముందున్నది. ముఖ్యంగా 2014లో కేంద్రంలో ప్రధాని నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చాక ఈ ఫిరాయింపుల ఘటనలు, ప్రభుత్వాలు మారడాలు ఎక్కువయ్యాయి.
ప్రశ్న: ఫిరాయింపులతో పార్టీల్లో చీలికలు తీసుకురావడంలో ఏ పార్టీ టాప్‌ప్లేస్‌లో ఉన్నది?
గ్రోక్: ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. ఫిరాయింపులతో పార్టీల్లో చీలికలు తీసుకురావడంలోనూ బీజేపీనే ముందున్నదని చెప్పొచ్చు. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న ‘మహావికాస్ అఘాడీ’లో విభేదాలను సృష్టించి.. శివసేన, ఎన్సీపీలు చీలిపోవడానికి బీజేపీనే కారణమని చెప్తారు.
ప్రశ్న: ప్రధాని మోదీ హయాంలో ఫిరాయింపులను ప్రోత్సహించి బీజేపీ ఏయే రాష్ర్టాల్లో అధికారంలోకి వచ్చింది?
గ్రోక్: ప్రధాని మోదీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించి బీజేపీ ఆరు రాష్ర్టాల్లో అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్, జేడీఎస్ కూటమి నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలతో 2019లో కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. జ్యోతిరాదిత్య సింధియా నేతృత్వంలో కాంగ్రెస్ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలతో 2020లో మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికార పగ్గాలు చేపట్టింది. శివసేన నుంచి ఏక్నాథ్ షిండే వర్గాన్ని చీల్చి, 2022లో మహారాష్ట్రలో బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకొన్నది. ఫిరాయింపుల ద్వారానే గోవా, మణిపూర్, అరుణాచల్‌ప్రదేశ్‌లోనూ బీజేపీ అధికారంలోకి వచ్చింది.
ప్రశ్న: ప్రభుత్వాలను రద్దు చేయడంలో ఏ పార్టీ ముందున్నది?
గ్రోక్: దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ప్రభుత్వాలను అత్యధికంగా రద్దు చేసిన పార్టీగా కాంగ్రెస్‌ను చెప్పొచ్చు. రాష్ట్రపతి పాలనను విధించేందుకు అవసరమైన రాజ్యాంగంలోని ఆర్టికల్ 356ను ఆ పార్టీ 100 కంటే ఎక్కువసార్లు ఉపయోగించింది. 70వ దశకంలో ఇందిరాగాంధీ పాలనలో ఈ ఆర్టికల్ దుర్వినియోగం ఎక్కువగా జరిగిందని చెప్పొచ్చు.
ప్రశ్న: కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఆర్టికల్ 356 ద్వారా ఏయే రాష్ర్టాల ప్రభుత్వాలను రద్దు చేసింది?
గ్రోక్: 1959లో ఈఎంఎస్ నంబూద్రిపాద్ నేతృత్వంలో కేరళలో ఏర్పాటైన కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని ఆర్టికల్ 356 ద్వారా కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. 1984లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ సర్కారుతో పాటు కర్ణాటక, పంజాబ్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ర్టాల్లో ప్రభుత్వాలను కాంగ్రెస్ రద్దు చేసింది.
ప్రశ్న: దేశంలో ఏ పార్టీ ప్రభుత్వం ఎక్కువగా రాష్ట్రపతి పాలనను విధించింది? ఏయే రాష్ర్టాల్లో ఎన్నిసార్లు విధించింది?
గ్రోక్: కాంగ్రెస్ హయాంలోనే దేశంలో రాష్ట్రపతి పాలన ఎక్కువగా విధించారు. మణిపూర్‌లో (10-11సార్లు), ఉత్తరప్రదేశ్‌లో (9-10సార్లు), కేరళలో (7-8సార్లు), పంజాబ్‌లో (7సార్లు), బీహార్‌లో (6-7సార్లు), ఆంధ్రప్రదేశ్‌లో (4-5సార్లు) ఇలా కాంగ్రెస్ పాలనలో ఎక్కువగా రాష్ట్రపతి పాలనను విధించారు.