PM Modi | హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పట్ల మొదటి నుంచి వివక్ష ప్రదర్శిస్తున్న కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారు, తాజాగా మరో కపట నాటకానికి తెరలేపింది. ఎన్నికలు దగ్గరపడేసరికి అభివృద్ధి పనులకు శంకుస్థాపనల పేరుతో హడావిడి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నది. బీజేపీ, దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్నచోట అభివృద్ధి పనులను ఆగమేఘాలమీద పూర్తిచేసి ప్రారంభిస్తున్న మోదీ సర్కారు.. తెలంగాణలో హామీలు, శంకుస్థాపనలతోనే కాలయాపన చేస్తున్నది. ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడేసరికి పాతవాటికే మళ్లీ శంకుస్థాపనలు చేసేందుకు పూనుకొన్నది.
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఈ 9 ఏండ్లలో తెలంగాణకు చెప్పుకోదగ్గ ఒక్క ప్రాజెక్టు కూడా మంజూరు చేయలేదు. పైగా అప్పటికే మంజూరు చేసిన ఐటీఐఆర్ వంటి మెగా ప్రాజెక్టులను కూడా రద్దుచేసింది. రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా ఇవ్వాల్సిన కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఊసే ఎత్తటంలేదు. అత్యంత భారీస్థాయిలో ఏర్పాటుచేస్తున్న ఫార్మాసిటీకి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఎస్ఆర్డీపీలో భాగంగా హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వం 35 ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మిస్తే, కేంద్రం తనవంతుగా ఒక్క పైసా సాయం చేసిన దాఖలాలు లేవు. రాష్ట్రప్రభుత్వం నిర్మించిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో వ్యర్థాల ట్రీట్మెంట్ ప్లాంట్‌తోపాటు మౌలిక సదుపాయాలకు రూ.వెయ్యి కోట్లు కేటాయించాలని కోరినా, ఇంతవరకు పైసా ఇవ్వలేదు. తెలంగాణకు మెగా టెక్స్టైల్ పార్క్‌ను మంజూరు చేస్తున్నట్టు సాక్షాత్తూ ప్రధాని మోదీయే ప్రకటించి ఏడాది కావస్తున్నా, ఇప్పటివరకు అధికారిక ఉత్తర్వులు రానేలేదు.
తాజాగా వచ్చేనెల 8న టెక్స్టైల్ పార్క్ శంకుస్థాపనకు ప్రధాని మోదీ వస్తున్నట్టు కేంద్రం ప్రకటించటంతో తెలంగాణవాదులు ఆశ్చర్యపోతున్నారు. ఇటీవల వందేభారత్ రైలును ప్రారంభించేందుకు రాష్ర్టానికి వచ్చిన మోదీ, ఇప్పటికే పనులు కొనసాగుతున్న బీబీనగర్ ఎయిమ్స్‌కు, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేయడంతో ప్రజలు ముక్కున వేలేసుకొన్నారు. రీజినల్ రింగురోడ్డు నిర్మాణానికి భూసేకరణ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వంపై మోపి ప్రాజెక్టును ముందుకు సాగకుండా ఆపిన కేంద్రం, తాజాగా అదే ఆర్ఆర్ఆర్ చుట్టూ రైల్ రింగ్ నిర్మించనున్నట్టు ప్రకటించటం గమనార్హం. ఒకవైపు ఆర్ఆర్ఆర్ను తొక్కిపెట్టి, మరోవైపు రైల్వే రింగు పేరుతో కొత్త ప్రాజెక్టును తెరపైకి తెచ్చి ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నది.
ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాలపై పగబట్టినట్టు వ్యవహరిస్తున్న కేంద్రం, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో వివిధ ప్రాజెక్టుల కోసం కోట్లాది రూపాయలు గుమ్మరిస్తున్నది. ఆగమేఘాల మీద పనులు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నది. గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, అస్సాం తదితర రాష్ర్టాల్లో ప్రణాళికాబద్ధంగా ప్రాజెక్టులను మంజూరుచేసింది. నిర్ధారిత గడువులోగా వాటిని పూర్తిచేసి ఒక్కొక్కటిగా ప్రారంభిస్తూ వస్తున్నది.