Hyderabad Metro | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): ‘గత తొమ్మిది సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన నయా మాడల్‌లో భాగంగా నగరాలు ఎంతో అభివృద్ధిని సాధించాయి. అందులో తెలంగాణకు కూడా భారీగానే ప్రయోజనం చేకూరింది. గత తొమ్మిది సంవత్సరాల్లో హైదరాబాద్‌లో 70 కిలోమీటర్ల మెట్రో రైలు వచ్చింది’. ఇదీ.. హైదరాబాద్ నగరం నడిబొడ్డున దేశ ప్రధాని నరేంద్రమోదీ ఆడిన పచ్చి అబద్ధం. వాస్తవానికి యూపీఏ ప్రభుత్వ హయాంలో మొదలైన హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుకు ఎదురైన అనేక అవరోధాలను పరిష్కరించి తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేసిన ప్రాజెక్టు ఇది. ప్రధాని మాత్రం దానిని తన ఖాతాలో వేసుకొన్నారు.
హైదరాబాద్ మెట్రో మొదటి దశకు సంబంధించి వయబులిటీ గ్యాప్ ఫండ్ బకాయిలను ఇవ్వకుండా కేంద్రం గత నాలుగేండ్లుగా నానబెడుతూనే ఉన్నది. ప్రపంచంలోనే ఇది అతిపెద్ద పబ్లిక్-ప్రైవేట్-పార్ట్నర్షిప్గా రూ.14,100 కోట్ల అంచనా వ్యయంతో 2007లో హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టును చేపట్టారు. ఆ సమయంలో మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నారు. ఉమ్మడి ఏపీలో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు అప్పటి యూపీఏ ప్రభుత్వం పది శాతం.. అంటే రూ.1,458 కోట్ల మొత్తాన్ని వయబుల్ గ్యాప్ ఫండ్ (వీజీఎఫ్) కింద సమకూర్చేందుకు అంగీకరించింది. ఈ మేరకు గతంలోని యూపీఏ ప్రభుత్వంతో పాటు మోదీ సర్కారు రెండుమూడు సంవత్సరాలు వీజీఎఫ్ నిధులను అంచెలంచెలుగా ఇచ్చింది.
ఐదేండ్ల కిందటి వరకు రూ.1,204 కోట్లు వచ్చాయి. కానీ గత ఐదేండ్లుగా మిగిలిన రూ.254 కోట్ల బకాయిని మాత్రం ఇవ్వడం లేదు. దీనిపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌తో పాటు ఉన్నతాధికారులు అనేకసార్లు లేఖ రాసినా స్పందన లేదు. ఇదిలా ఉంటే మెట్రో రెండో దశ ప్రతిపాదనలను పంపితే ‘తగినంత ట్రాఫిక్ లేదు’ అని సిల్లీ కారణం చూపి మోదీ సర్కారు తప్పించుకొన్నది. మెట్రోను తానే తెచ్చానని ప్రధాని హోదాలో ఉండి నరేంద్రమోదీ అబద్ధమాడటం బీజేపీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని తెలంగాణవాదులు మండిపడుతున్నారు.