Congress-BJP | హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): అక్కడ కయ్యం, ఇక్కడ వియ్యం అన్నట్టుగా రెండు ప్రధాన జాతీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయని తెలంగాణలో రోజువారీ పరిణామాలను గమనిస్తున్న పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. కేంద్రంలో బద్ధ విరోధులుగా ఉంటున్న కాంగ్రెస్, బీజేపీ రాష్ట్రంలో మాత్రం స్నేహ బంధాన్ని కొనసాగిస్తున్నట్టున్నాయని పేర్కొంటున్నారు. పది నెలల పాలనలో రేవంత్రెడ్డి ప్రభుత్వం అన్ని వర్గాల వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నా బీజేపీ ఇంతవరకు స్పందించకపోవడం అనుమానాస్పదంగా ఉన్నదని అంటున్నారు.
హైడ్రాకు వికృతరూపమిచ్చి పేదల ఇండ్ల మీదికి వదలడంతో వందల కుటుంబాలు రోడ్డు పడుతున్నాయి. రూ 2 లక్షల రుణమాఫీ కోసం లక్షల మంది రైతులు గంపెడు ఆశతో ఎదురుచూస్తున్నారు. రైతు భరోసా అందక, అప్పు పుట్టక రైతన్నలు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఇంత జరుగుతున్నా బీజేపీ నాయకులు రేవంత్రెడ్డి ప్రభుత్వం మీద ఒక్క విమర్శ కూడా చేయకపోగా.. ఏ అధికారమూ లేని బీఆర్ఎస్ను, కేసీఆర్ను టార్గెట్ చేస్తూ విమర్శించటం పట్ల స్వయంగా ఆ పార్టీల శ్రేణులే విస్మయం వ్యక్తంచేస్తున్నాయి.
అమృత్ స్కీం టెండర్లలో జరిగిన కుంభకోణాన్ని బహిర్గతం చేసిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బాధ్యులను చట్టప్రకారం శిక్షించాలని డిమాండ్ చేశారు. దీనిపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు సైతం ఆయన ఆధారాలతో సహా లేఖ రాశారు. ఈ విషయంలో మొదట్లో కొంత హడావుడి చేసినట్టు కనిపించినా బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డి ఆ తరువాత మౌనం దాల్చారు. ఇక హైదరాబాద్లో హైడ్రా ఆగడాలతో పేదలు గూడులేని పక్షలుగా మారిపోతున్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నా బీజేపీ నేతలు మాత్రం స్పందించలేదు. చివరికి తాము ఎక్కడ వెనుకబడిపోతామోనన్నట్టు కేంద్ర మంత్రి బండి సంజయ్ సోమవారం స్పందించారు. చెరువులు, కుంటలను ఆక్రమించి సంపన్నులు నిర్మించిన భవనాలను హైడ్రా కూల్చివేస్తుందని భావించామని, కానీ పేద, మధ్య తరగతి ప్రజల ఇండ్లను కూల్చి వాళ్లకు నిలువ నీడలేకుండా చేస్తున్నదని విమర్శించారు.