MLC Kavitha | కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు బీజేపీ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఎనిమిది మంది చొప్పున ఎంపీలు ఉన్నా సాధించిన నిధులు సున్నా అని విమర్శించారు. తెలంగాణపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని ఈ బడ్జెట్‌తో తేటతెల్లమైందని, అదే సమయంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తన అసమర్థతను మరోసారి నిరూపించుకుందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. తెలంగాణకు సంబంధించిన ఏ ఒక్క అంశానికి కూడా బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం ఆక్షేపనీయమని అన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వకపోవడం, సమ్మక్క-సారక్క జాతరకు కూడా జాతీయ హోదా ప్రకటించకపోవడం అనేది తెలంగాణ ప్రజలపై బీజేపీ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని అర్థమైందని స్పష్టం చేశారు.
రూ.1.50లక్షల కోట్ల మేర వడ్డీ లేని రుణాలను రాష్ట్రాలకు ఇస్తామని కేంద్రం చెబుతోందనని.. మరి బడే భాయ్.. చోటా భాయ్ అంటూ తిరిగే మన సీఎం రేవంత్ రెడ్డి కనీసం ఆ రుణాల్లో తెలంగాణకు కొంతైనా సాధించే ప్రయత్నం చేయాలని డిమాండ్ చేశారు. సుదీర్ఘకాలంగా తెలంగాణ ప్రజలు డిమాండ్ చేస్తున్న ఐఐఎం సంస్థ ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోకపోవడం దారుణమన్నారు. ఉపాధి హామీ పథకానికి గత నాలుగు సంవత్సరాల నుంచి ఒకే మొత్తంలో నిధులు కేటాయిస్తుందని, కనీసం ఈ ఏడాది కూడా ఉపాధిహామీకి నిధులు పెంచకపోవడం శోచనీయమన్నారు. పేద ప్రజలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్న విషయం తేటతెల్లమైందని ఎండగట్టారు. బ్రిటిష్ పరిపాలనలో చేనేతపై పన్ను విధించలేదని.. కానీ, బీజేపీ ప్రభుత్వం పన్ను విధించిందని, దాన్ని రద్దు చేయాలని దేశవ్యాప్తంగా అనేక ఆందోళనలు జరుగుతున్నా కేంద్రం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. రైతాంగం, మహిళా సాధికారత, ప్రజా సంక్షేమం వంటి అంశాలపై కేంద్ర బడ్జెట్లో ఊసే లేదని విమర్శించారు.
విద్యా రంగానికి కేవలం 2.5శాతం అరకొర నిధులు కేటాయించారని పేర్కొన్నారు. విద్యారంగానికి కనీసం ఆరు శాతం నిధులు కేటాయించి ఉంటే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళ విద్యార్థులకు పూర్తి శాతం స్కాలర్షిప్లు ఆస్కారం ఉండేదని అభిప్రాయపడ్డారు. పసుపు బోర్డుకు గుండు సున్నా అని.. పసుపు బోర్డు ఏర్పాటు చేశామని గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీ ప్రభుత్వం ఒక్క పైసా కూడా కేటాయించకపోవడంపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. పసుపు బోర్డు తరహాలోనే పనిచేసే స్పైసెస్ బోర్డు, టీ బోర్డు, కాఫీ బోర్డు, రబ్బర్ బోర్డులకు నిధులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం.. పసుపు బోర్డుకు మాత్రం రూపాయి కూడా కేటాయించలేదని తెలిపారు. పసుపు బోర్డుకు నిధులు కేటాయించకుండా నిజామాబాద్ రైతాంగాన్ని కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందని ధ్వజమెత్తారు. నిధులు లేని పసుపు బోర్డు ఎలా పనిచేస్తుందని, ఏం పరిశోధనలు చేయగలరని ప్రశ్నించారు.