Group-1 | గ్రూప్-1 పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని ఆందోళనకు దిగిన అభ్యర్థులపై కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూప్-1 అభ్యర్థులు పలువురు కరీంనగర్లోని బండి సంజయ్ నివాసానికి వెళ్లి కలుసుకున్నారు. మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయడంలో తమకు సాయం చేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా గ్రూప్స్ అభ్యర్థుల ఆందోళనకు ఆయన సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
గ్రూప్-1 అభ్యర్థులపై లాఠీచార్జ్ చేయడం దారుణమని బండి సంజయ్ అన్నారు. న్యాయం కోరితే రక్తం కళ్లజూస్తారా అని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లకు జీవో 29 గొడ్డలి పెట్టు అని ఆయన వ్యాఖ్యానించారు. గ్రూప్ – 1 అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూప్ -1 పరీక్షలను రీషెడ్యూల్ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. అశోక్ నగర్ నుంచి ఉద్యమం తెలంగాణ అంతా వ్యాపిస్తుందని హెచ్చరించారు. సమస్య తీవ్రం కాకముందే ప్రభుత్వం దిగిరావాలని సూచించారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం అదేశాల మేరకు అశోక్ నగర్ వెళ్లి గ్రూప్-1 అభ్యర్థులను కలుసుకుంటానని చెప్పారు.
షెడ్యూల్ ప్రకారమే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. దీంతో షెడ్యూల్ ప్రకారమే ఈ నెల 21 నుంచి యథావిధిగా గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను నిర్వహించనున్నారు. సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించింది. ప్రాథమిక కీలో తప్పులున్నాయనే పిటిషన్పై డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది. గ్రూప్-1 పరీక్షలపై దాఖలైన పిటిషన్లను అన్నింటినీ హైకోర్టు కొట్టి వేసింది.