చేవెళ్లలో డమ్మీ క్యాండిడేట్‌ను నిలబెట్టారు. ఈ విషయంలో రేవంత్‌రెడ్డికి నేను ధన్యవాదాలు చెప్తున్నా
– ఇటీవల చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు
రేవంత్‌రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిని చేయాలని అప్పట్లో నాన్న గట్టిగా పోరాడారు. ఇప్పుడు చేవెళ్లలో రంజిత్‌రెడ్డిని నిలబెట్టడమే మాకు ఆయన ఇచ్చిన పెద్ద గిఫ్ట్. పట్నం సునీత మహేందర్‌రెడ్డి అభ్యర్థి అయితే టఫ్ ఫైట్ ఉండేది
– ఇటీవల కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కుమారుడు విశ్వజిత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు
CM Revanth Reddy | హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మిలాఖత్కు ఈ రెండు వ్యాఖ్యలే నిదర్శనం. ఇటీవలి ఎన్నికల్లో చేవెళ్ల నుంచి బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఏకంగా 1.73 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కనీసం ఒక్క ఎమ్మెల్యే, జెడ్పీటీసీ, ఎంపీపీ కూడా లేని నియోజకవర్గంలో బీజేపీకి ఏకంగా 8 లక్షలకుపైగా ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ పరోక్షంగా సహకరించడం వల్లే ఈ ఫలితం వచ్చిందనేది బలంగా వినిపిస్తున్న ఆరోపణ. వాస్తవానికి చేవెళ్ల, మల్కాజిగిరి స్థానాల్లో సీఎం రేవంత్‌రెడ్డి ఉద్దేశపూర్వకంగానే డమ్మీ అభ్యర్థులను నిలబెట్టారని మొదటి నుంచి విమర్శలు ఉన్నాయి.
చేవెళ్ల నియోజకవర్గానికి చెందిన పట్నం సునీత మహేందర్‌రెడ్డిని తీసుకొచ్చి మల్కాజిగిరిలో పోటీ చేయించిన సంగతి తెలిసిందే. రాత్రికి రాత్రి పార్టీ మారి ప్రజాగ్రహాన్ని మూటగట్టుకున్న రంజిత్‌రెడ్డికి చేవెళ్ల టికెట్ ఇచ్చారు. వాస్తవానికి ఎంపీ టికెట్ ఇస్తామన్న హామీ మేరకే పట్నం సునీత, మహేందర్‌రెడ్డి దంపతులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారనేది బహిరంగ రహస్యం. ఈ మేరకు చేవెళ్లలో పట్నం సునీతను పోటీ చేయిస్తే మెరుగైన ఫలితం ఉంటుందని నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు నెత్తీనోరు కొట్టుకున్నారు. కానీ.. సీఎం రేవంత్‌రెడ్డి పట్టుబట్టి మరీ రంజిత్‌రెడ్డిని బరిలో నిలిపారు.
కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచి రేవంత్‌రెడ్డికి మద్దతుదారుగా, సన్నిహితుడిగా పేరొందారు. రేవంత్‌రెడ్డికి 2021 జూలైలో పీసీసీ అధ్యక్ష పదవి దక్కడంలో తాను కీలక పాత్ర పోషించారని కొండా పదేపదే చెప్తుంటారు. రేవంత్‌రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి ఇప్పించడానికి నేను చాలా లాబీ చేశాను’ అని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి గతంలో ఓ మీడియా చానల్‌తో పేర్కొన్నారు. అయితే ఎన్నడూ సీఎం రేవంత్‌రెడ్డిగానీ, కాంగ్రెస్ గానీ ఈ వ్యాఖ్యలను ఖండించకపోవడం గమనార్హం. దీనిని బట్టి కొండా, రేవంత్‌రెడ్డి మధ్య స్నేహం బలమైనదేనని అర్థమవుతున్నదని చెప్తున్నారు. అందుకే అప్పట్లో తనకు చేసిన సాయానికి రుణం తీర్చుకునేందుకే చేవెళ్ల నుంచి ‘పట్నం’ కుటుంబాన్ని బయటికి పంపి, కొండాపై డమ్మీ అభ్యర్థిని నిలబెట్టాడనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ‘రేవంత్‌రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా చేయాలని నాన్న సపోర్ట్ చేశారు. రంజిత్‌రెడ్డి వంటి వ్యక్తికి చేవెళ్ల టికెట్ ఇవ్వడమే వారిద్దరి మధ్య స్నేహానికి నిదర్శనం. పట్నం సునీత మహేందర్‌రెడ్డి అభ్యర్థి అయితే టఫ్ ఫైట్ ఉండేది.
రంజిత్‌రెడ్డిని పెట్టడమే మాకు పెద్ద గిఫ్ట్’ అని కొండా విశ్వజిత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అందుకే చేవెళ్లలో సరైన నాయకులు, కార్యకర్తలు లేకపోనా కొండా గెలిచారన్న వాదనలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పడిన ఓట్లలో భారీగా బీజేపీకి పడ్డాయని స్వయంగా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చెప్పారు. ‘చేవెళ్లలో మాకు ఒక్క ఎమ్మెల్యే లేరు, జెడ్పీటీసీ లేరు, ఎంపీపీలు లేరు, కొందరు సర్పంచులు, ఎంపీటీసీలు మాత్రమే ఉన్నారు. వాస్తవానికి బీఆర్ఎస్ ఓట్లు మాకు పడలేదు. వాళ్ల ఓట్లు దాదాపు 2 లక్షలు వాళ్లకే పడ్డాయి. గతంలో బీఆర్ఎస్కు మద్దతుగా ఉన్న మైనార్టీలు దాదాపు రెండు లక్షల మంది కాంగ్రెస్‌కు ఓటేశారు. రాజేంద్రనగర్‌లో సులేమాన్‌నగర్, శాస్త్రిపురం, మహేశ్వరంలో పహాడిషరీఫ్, జల్పల్లిలో బీఆర్ఎస్ ఓట్లు కాంగ్రెస్‌కు పడ్డాయి. కాంగ్రెస్ ఓటు బ్యాంకులో 40 శాతం బీజేపీకి పడింది’ అని ఓ ఇంటర్యూలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తన విజయానికి గల కారణాలను వివరించారు. దీనిని బట్టే చేవెళ్ల పార్లమెంట్లో కాంగ్రెస్ ఓట్లు బీజేపీకి మళ్లాయని, ఇది రెండు పార్టీల మధ్య జరిగిన అంతర్గత ఒప్పందానికి నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.