కాగజ్‌నగర్, ఆగస్టు 25: రాష్ట్రంలో యూరియా కొరతకు కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలే కారణమని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు రోడ్ల మీదికి వచ్చి ధర్నాలు చేస్తుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరి మీద, ఒకరు నెట్టుకుంటూ డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు.
మార్చిలో ముందస్తుగా బఫర్ స్టాక్ తెచ్చుకోకుండా రేవంత్ సరార్ ఏం చేసిందని ప్రశ్నించారు. రైతులను ఆదుకోవడం మరిచిపోయి, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేసేందుకు డ్రామాలు చేస్తూ కాలయాపన చేశారని దుయ్యబట్టారు.
రైతు సంఘాలు, వ్యవసాయ అధికారులతో మాట్లాడకుండా, సినీ దర్శకులు, నిర్మాతలతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రైతులను అవమానిస్తున్నారని స్పష్టం చేశారు. ఇక్కడి రైతు సమస్యలు పరిష్కరించకుండా బీహార్‌లో ఎన్నికల ర్యాలీలో పాల్గొనడానికి వెళ్తున్నారని మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలకు లేని యూరియా కొరత తెలంగాణకు మాత్రమే ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు.