Kishan Reddy | వరంగల్,ఫిబ్రవరి 16 : మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే నిధులు వృథా అవుతాయని, ఆ ప్రాంతంలో దొరికేది నాసిరకం ఖనిజమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం హనుమకొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. 14 నెలల కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండటంతో ప్రజల దృష్టి మళ్లించేందుకే ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వంపై సీఎం రేవంత్ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
దేశంలో ఏ సీఎం కూడా ప్రతివారం ఢిల్లీ చుట్టూ తిరుగలేదని ఎద్దేవా చేశారు. రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ పోరాటాలు చేస్తుందని చెప్పారు. రాష్ట్రంలో కుల గణన సర్వేను ఏ ఒక్క బీసీ సంఘం అంగీకరించడం లేదన్నారు. బీసీ రిజర్వేషన్లకు బీజేపీ మద్దతు ఇస్తుందని, బీసీ సంఘాలు సమర్థిస్తే కుల గణనను కేంద్రం ఆమోదించేలా చేస్తామని హామీ ఇచ్చారు. వంద రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఒక్క కొత్త ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేదని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ల ద్వారా వచ్చిన ఉద్యోగాలను మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేసిందని చెప్పారు. త్వరలోనే బీజేపీ కొత్త అధ్యక్షుడి నియమాకం జరుగుతుందని తెలిపారు.