హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానలకు మందులు, సర్జికల్స్, ఎక్విప్మెంట్ సరఫరా చేసిన ఏజెన్సీలను కాంగ్రెస్ సర్కార్ ఆగమాగం చేస్తున్నది. వాటి బకాయిలను చెల్లించకుండా రాచి రంపాన పెడుతున్నది. మందులకు రూ.200 కోట్లు, ఎక్విప్మెంట్కు రూ.150 కోట్లు, సర్జికల్స్‌కు రూ.128 కోట్లు కలిపి ఏజెన్సీలకు మొత్తం రూ.478 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉండగా నెలకు కేవలం రూ.50 కోట్లు కేటాయించి చేతులు దులిపేసుకుంటున్నది. ఇవి ఏమా త్రం సరిపోవడం లేదని, పెండింగ్ బకాయిలు భారీగా పేరుకుపోవడం వల్ల వైద్య సామగ్రిని సరఫరా చేయలేకపోతున్నామని ఏజెన్సీల నిర్వాహకులు ఇటీవల టీజీఎంఎస్ఐడీసీ ఎండీ, ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ శాఖ సెక్రటరీకి మొరపెట్టుకున్నారు. దీంతో ఈ సమస్యను వైద్యారోగ్య శాఖ మంత్రికి, ఆయన ద్వారా ఆర్థిక శాఖ మంత్రికి వివరించిన ఆ అధికారి.. ప్రతినెలా టీజీఎంఎస్ఐడీసీకి రూ.100 కోట్లు కేటాయించాలని కోరారు. అందుకు ఆర్థికశాఖ మంత్రి అంగీకరించడంతో గత నెలలో రూ.100 కోట్ల బిల్లుల క్లియరెన్స్‌కు ప్రతిపాదనలు పంపారు. కానీ, ఆ ప్రతిపాదనలను వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారి తిరస్కరించడంతోపాటు ఎవరి అనుమతితో రూ.100 కోట్లకు బిల్లులు పంపారని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
సరఫరా నిలిపివేస్తామంటున్న ఏజెన్సీలు
తమ బిల్లులు సక్రమంగా చెల్లించకపోతే దవాఖానలకు వైద్య సామగ్రి సరఫరాలు నిలిపివేస్తామని ఏజెన్సీల నిర్వాహకులు అంటున్నారు. ఈ విషయమై సంబంధిత ఉన్నతాధికారిని కలిసేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని వాపోతున్నారు. బకాయిల గురించి ప్రస్తావిస్తే డీఎంఈని కలవాలని ఉచిత సలహా ఇస్తున్నారని, డీఎంఈని కలిస్తే ఆ ఉన్నతాధికారికే ఫైల్ పెడుతామంటున్నారని మండిపడుతున్నారు. ఇప్పటికే ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తమ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే గత 6 నెలలుగా కొన్ని సర్జికల్ ఐటమ్స్ సరఫరా నిలిపేశామని, సూపరింటెండెంట్ల విజ్ఞప్తి మేరకు కొన్ని అత్యవసర సర్జికల్స్‌ను మాత్రమే సరఫరా చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ దవాఖానల్లో సర్జికల్స్ అందుబాటులో లేకపోవడంతో రోగులు అధిక మొత్తంలో సొమ్ము వెచ్చించి బయటి నుంచి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొన్నదని చెప్తున్నారు. సమస్యను పరిష్కరించేందుకు కొత్త ఎండీ ప్రయత్నిస్తుంటే వైద్యశాఖ ఉన్నతాధికారి అడ్డుతగలడమేంటని ప్రశ్నిస్తున్నారు. పెండింగ్ బకాయి లు భారీగా పేరుకుపోయినందున రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని, టీజీఎంఎస్ఐడీసీకి ప్రతి నెలా రూ.100 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు.