నిజామాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ ప్రజాపాలనలో నిజామాబాద్ నగరం అభివృద్ధిలో ఐదేండ్లు వెనక్కు నెట్టవేయబడిందని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చారిత్రక నిజామాబాద్ ప్రాంతం అనాథగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ ఏం చేస్తున్నాడో ఆయనకే అర్థం కావడం లేదని ఎద్దేవాచేశారు. షబ్బీర్ అలీ పూటకో మాట మాట్లాడుతూ అబద్ధపు ప్రచారాలతో కాలం గడుపుతున్నారని మండిపడ్డారు. ఆదివారం ఆయన నిజామాబాద్ జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో సమీకృత కలెక్టరేట్, న్యాక్ భవనం, గిరిరాజ్ కాలేజీ రెండో బ్లాక్, ఐటీ హబ్, విజయ టాకీస్ పక్కన అండర్ పాస్ రోడ్డు, మినీ ట్యాంక్ బండ్, వైకుంఠధామాలు, 25 కిలోమీటర్లు డివైడర్లు, అడుగడుగునా చెట్లు, వీధిదీపాలు, ఎస్టీపీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, రూ.6 కోట్లతో మైనార్టీ స్కూళ్లు నిర్మించామని వెల్లడించారు.
నిజామాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్ ప్రారంభోత్సవం సందర్భంగా 2022, సెప్టెంబర్ 5న సీఎం కేసీఆర్ రూ.100 కోట్లు మంజూరు చేస్తే ఆ నిధులను తాము తెచ్చామని షబ్బీర్ అలీ చెప్పుకోవడం సిగ్గుచేటని ఎద్దేవాచేశారు. సమావేశంలో మాజీ మేయర్ నీతూకిరణ్, నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సిర్ప రాజు తదితరులు పాల్గొన్నారు.