సూర్యాపేట, జనవరి 19 (నమస్తే తెలంగాణ): ఖమ్మం భారీ బహిరంగ సభతో బీఆర్ఎస్ దేశ రాజకీయాల్లో పెనుమార్పు తీసుకురాబోతున్నదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కుడకుడలో రాజ్యసభసభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, కలెక్టర్ పాటిల్ హేమంత కేశవ్‌తో కలిసి కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సరికొత్త పంథాలో హస్తినకు అడుగులు వేస్తున్నారని తెలిపారు. ఆ అడుగులు 2024లో సరికొత్త శకానికి శ్రీకారం చుట్టబోతున్నట్టు స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీల ఏలుబడిలో దేశం అంధకారంలోకి వెళ్లిందని విమర్శించారు.
ఇలాంటి గడ్డు పరిస్థితుల నుంచి దేశాన్ని బయట పడేసేందుకు బీఆర్ఎస్ ఆవిర్భవించిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో సీఎం కేసీఆర్‌కు, బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారని, అది ఖమ్మం సభ సక్సెస్‌తో నిరూపితమైందని చెప్పారు. దేశంలో అలుముకున్న చీకట్లను తొలగించాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమని అన్నారు. ఇప్పటికీ దేశంలో 35 శాతానికి పైగా ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితులను అధిగమించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్కు భారత దేశ ప్రజల ఆశీర్వాదాలు ఉంటాయని తెలిపారు.