రంగారెడ్డి, మే 11 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లాలో భూదాన్ భూములు క్రమంగా మాయమవుతున్నాయి. గతంలో ఈ జిల్లాలోని అనేక మంది భూస్వాములు వేల ఎకరాలను ఉచితంగా భూదాన్ బోర్డుకు ఇచ్చేయడంతో అనంతరం వాటిని భూమి లేని నిరుపేదలకు పంచి పట్టాలు అందజేశారు. కానీ, ఇటీవల ఈ జిల్లాలో భూముల ధరలు విపరీతంగా పెరగడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నాయకుల కన్ను భూదాన్ భూములపై పడింది. దీంతో ఇప్పటికే జిల్లావ్యాప్తంగా వేల ఎకరాల భూ ములు అన్యాక్రాంతమయ్యాయి. ఇబ్రహీంపట్నం సమీపంలో ప్రభుత్వం వివిధ కంపెనీలకు దాదాపు 3వేల ఎకరాల భూదాన్ భూ ములను కేటాయించింది. మిగిలిన భూములను అధికారుల అండతో కొందరు రాజకీయ నాయకులు సొంతం చేసుకున్నారు. వాటిలో రాత్రికిరాత్రే వెంచర్లు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని అబ్దుల్లాపూర్‌మెట్, ఇబ్రహీంపట్నం, బాటసింగారం, జాఫర్‌గూడ, కుంట్లూరు, తారామతిపేట, నాగన్‌పల్లి, పోల్కంపల్లి, నెర్రపల్లి, దండుమైలారం, మొండిగౌరెల్లి, యాచారం, నందివనపర్తి తదితర ప్రాంతాల్లో భూదాన్ భూములు అధికంగా ఉన్నాయి. చేవెళ్ల, షాద్‌నగర్ నియోజకవర్గాల్లో సైతం భూదాన్ భూములున్నాయి. రికార్డుల్లో భూదాన్ బోర్డు పేరిట ఉన్న ఆ భూములను అధికారుల అండతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు సొంతం చేసుకుంటున్నారు. భూదాన్ భూములను అమ్మటం, కొనటం నేరమైనప్పటికి రికార్డులు తారుమారుచేసి యథేచ్ఛగా క్రయవిక్రయాలు జరుపుతున్నారు.
భూదాన్ ఉద్యమ సమయంలో ఆచార్య వినోభాబావే, భూదాన్ పోచంపల్లికి చెందిన రాంచంద్రారెడ్డి రంగారెడ్డి జిల్లాలో పర్యటించి దాదాపు 22 వేల ఎకరాలకుపైగా మిగులు భూములను సేకరించారు. హైదరాబాద్ శివారులోని బాలాపూర్, యాచారం, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్‌మెట్, జాఫర్‌గూడ, పిగ్లీపూర్, కుంట్లూరు, తారామతిపేట, వట్టినాగులపల్లి, మంఖాల, మహేశ్వరంలో ఆ భూములు విస్తరించి ఉన్నాయి. వాటిలో కొన్నింటిని అప్పట్లో భూముల్లేని పేదలకు పంపిణీ చేశారు. మరి కొన్ని భూములను లీజుకు ఇచ్చారు. మిగిలిన భూములు భూదాన్ బోర్డు ఆధీనంలో ఉన్నాయి. కానీ, అదంతా పేరుకు మాత్రమే. రికార్డులను తారుమారు చేసి చాలా భూములను రియల్టర్లు అన్యాక్రాంతం చేశారు.
భూదాన్ భూములను కాజేసేందుకు కొందరు నానా రకాల కుట్రలు చేస్తున్నారు. ఆ భూములు భూదాన్ బోర్డు పరిధిలో లేవని నకిలీ ఎన్వోసీలను సృష్టించి రెవెన్యూ రికార్డుల్లో పట్టా భూములుగా మారుస్తున్నారు. అలా ఇప్పటికే చాలా భూములు చేతులు మారుతున్నాయి. మరికొందరు సామాజిక సేవా కార్యక్రమాల పేరుతో భూదాన్ భూములను లీజుకు తీసుకుని కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం మేల్కోవాలని, భూదాన్ భూముల అన్యాక్రాంతంపై విచారణ జరిపించి, కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.
రంగారెడ్డి జిల్లాలో భూదాన్ భూములను కాజేసేందుకు ఎంతో మంది ఏండ్ల తరబడి ప్రయత్నిస్తున్నారు. కొందరు బడాబాబులు అధికారులతో కుమ్మక్కై ఇష్టారాజ్యంగా ఆ భూములను కబ్జా చేస్తున్నారు. దీనిపై స్పందించాల్సిన ప్రభుత్వం ఏమీ పట్టించుకోకుండా నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నది. ఇప్పటికైనా ప్రభుత్వం భూదాన్ భూములపై దృష్టిసారించాలి. అన్యాక్రాంతంపై విచారణ జరిపించి ఆ భూముల పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి. లేకుంటే భూదాన్ భూములు పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉన్నది.