Bhatti Vikramarka | హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తేతెలంగాణ): రైతు కూలీలకు భరోసా కింద నగదు జమ చేస్తామని భట్టి విక్రమార్క చెప్పిన గడువు శనివారం ముగిసింది. కానీ ప్రభుత్వం నుంచి ఉలుకూపలుకూ లేకుండా పోయింది. ఆర్థిక సాయం అందిస్తామని స్వయంగా డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి చెప్పడం, రూ.900 కోట్లు కేటాయిస్తామని ప్రభుత్వంలోనే కీలకమైన మంత్రి ప్రకటించడంతో రాష్ట్రంలోని రైతు కూలీలంతా నమ్మారు. శనివారం నుంచే తమ ఖాతాల్లో రూ.6 వేల చొప్పున జమవుతాయని సంబురపడ్డారు. కానీ.. భట్టి మాట ఉట్టిదేనని, పొంగులేటి ప్రకటనలో పస లేదని తేలిపోయింది. గడువు ముగిసినా ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేకపోవడంతో రైతు భరోసా, ధాన్యానికి బోనస్ మాదిరిగానే, రైతు కూలీలకు భరోసా కూడా బోగసేనన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పాలసీ తేలకుండానే ప్రగల్భాలు
ఉపాధిహామీ పథకంలోని జాబ్‌కార్డులను పరిగణనలోకి తీసుకొని భూమిలేని నిరుపేదలను గుర్తిస్తామని ప్రభుత్వం గతంలో చెప్పింది. ఈ పథకం కోసం బడ్జెట్లో రూ.12 వేల కోట్లు కేటాయించామని పేర్కొన్నది. భూమిలేని పేదలను గుర్తించేందుకు పంచాయతీ కార్యదర్శుల సహకారంతో ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్ల ద్వారా సర్వే చేయిస్తున్నామని చెప్పుకొచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాల్లో 53.6 లక్షల మందికి జాబ్‌కార్డులు ఉండగా.. వీరిలో వ్యవసాయ భూమి లేనివారు సుమారు 15 లక్షల మంది ఉంటారని ప్రాథమికంగా నిర్ధారించింది. ఇదే సంఖ్యను మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. ఆ తర్వాత ప్రభుత్వం ఎలాంటి కసరత్తు చేయలేదని సచివాలయ వర్గాలు చెప్తున్నాయి. నిజమైన లబ్ధిదారులు ఎంతమంది? వారికి ఏటా ఎంత జమ చేయాలి? వ్యక్తులకు వేస్తారా.. లేక కుటుంబాలను ప్రామాణికంగా తీసుకుంటారా? ఎంత ఖర్చవుతుంది? వంటివేవీ అధ్యయనం చేయలేదని అంటున్నారు. పైగా సంబంధిత శాఖ నుంచి ప్రతిపాదనలు, ఆర్థిక శాఖ నుంచి అనుమతుల వంటి ప్రక్రియలేవీ జరగలేదని చెప్తున్నారు. అయినా 28 నుంచి ఖాతాల్లో వేస్తామని, రూ.900 కోట్లు ఖర్చు చేస్తామని ఎలాంటి పాలసీ లేకుండానే మంత్రులు ప్రగల్భాలు పలికారన్న విమర్శలు వస్తున్నాయి.
నిరాశలో నిరుపేదలు
సాక్షాత్తూ డిప్యూటీ సీఎం భట్టి చెప్పిన గడువు పూర్తయి 48 గంటలు దాటినా నగదు జమ దేవుడెరుగు.. కనీసం మార్గదర్శకాలు కూడా విడుదల కాలేదు. తమ ఖాతాల్లో చిల్లిగవ్వకూడా పడకపోడంతో పేదలు నిరాశలో మునిగిపోయారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీల అమలు, రైతు రుణమాఫీ, పెన్షన్ పెంపు, రైతు భరోసా తరహాలో ఈ హామీ కూడా అటకెక్కినట్టేనని విమర్శిస్తున్నారు. రైతు కూలీలకు భరోసా ప్రకటించి వెనక్కి తగ్గడంపై రైతు సంఘాల నాయకులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి మాటకే విలువలేకుంటే ఈ సర్కారును నమ్మేదేలా? అని మండిపడుతున్నారు. మార్గదర్శకాలు విడుదల చేయకుండానే హడావుడి చేయడం ఎందుకని నిలదీస్తున్నారు. అన్నివర్గాలను మోసం చేసినట్టుగానే నిరుపేద రైతు కూలీలను కాంగ్రెస్ సర్కార్ దగా చేసిందని విమర్శిస్తున్నారు.
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో భూమిలేని రైతుకూలీలు, నిరుపేదలకు ఏటా రూ.12 వేల చొప్పున ఆర్థికసాయం అందించే పథకం ప్రారంభం.
– ఆరు గ్యారెంటీల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఇది
కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన రోజైన డిసెంబర్ 28 నుంచి భూమి లేని నిరుపేద కూలీలందరికీ రూ.12 వేలు అందించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. అదేరోజు మొదటివిడుతగా రూ.6 వేల చొప్పున ఖాతాల్లో జమచేస్తాం.
-ఈ నెల 15న ఖమ్మంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటన ఇది..
రైతు కూలీలకు ఆర్థిక సాయం కోసం రూ.900 కోట్లు కేటాయిస్తున్నాం. మొత్తం 15 లక్షల మందికి సాయం అందిస్తాం.
– ఈ నెల 23న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పిన లెక్కలివి..