Harish Rao | సింగరేణి స్కాం సూత్రధారి సీఎం రేవంత్ రెడ్డి అయితే.. పాత్రధారి ఆయన బామ్మర్ది సృజన్ రెడ్డి అని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిన్న ప్రెస్మీట్లో మాట్లాడుతూ.. ఈ కుంభకోణంపై లేఖ రాస్తే రేవంత్ రెడ్డితో మాట్లాడతానని చేసిన వ్యాఖ్యలపై హరీశ్‌రావు మండిపడ్డారు. ఈ అవినీతికి సూత్రధారే రేవంత్ రెడ్డి.. అయినప్పుడు రేవంత్ రెడ్డితో మాట్లాడితే ఏం వస్తుందని ఆయన ప్రశ్నించారు.
భట్టి విక్రమార్క ప్రెస్‌మీట్ చూస్తుంటే ఉల్టాచోర్ కొత్వాల్ కో డాంటే అన్న సామెత గుర్తొస్తుందని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. బొగ్గు కుంభకోణంపై స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా మాటల గారడీతో, నాలుగు కాగితాలు చూపి మసిపూసి మారేడు కాయ చేసే ప్రయత్నం భట్టి చేశారని విమర్శించారు. సైట్ విజిట్ సర్టిఫికెట్‌పై భట్టి విక్రమార్క అబద్ధాలను వండి వార్చారని అన్నారు.
సింగరేణి కాలరీస్ అనేది తెలంగాణ ప్రజల ఆస్తి.. ఇది ఏ ఒక్క మంత్రికో, ప్రభుత్వానికో, కొద్దిమంది కాంట్రాక్టర్లకో చెందిన సంస్థ కాదని హరీశ్‌రావు స్పష్టం చేశారు. సింగరేణిలో పారదర్శకత, పోటీ, న్యాయం అనే మౌలిక సూత్రాలతో నడుస్తున్నదని తెలిపారు. సింగరేణి టెండర్ ప్రక్రియను చూస్తే ఈ మూడు సూత్రాలకు మంగళం పాడారు అని స్పష్టమవుతున్నదని పేర్కొన్నారు.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విధానాలన్నీ పక్కనపెట్టి అవసరమైన చోట వారి అనుకూలమైన విధానాలను మార్చుకున్నారని మండిపడ్డారు.
సింగరేణి స్కామ్‌కు ఎవరు బాధ్యులు? ఎంత నష్టం జరిగింది? లబ్ధి పొందిన వారు ఎవరు? ఈ మూడు కీలక ప్రశ్నల్లో ఒక్కదానికైనా భట్టి సమాధానం చెప్పకుండా దాటివేశారని హరీశ్‌రావు అన్నారు. సింగరేణి కుంభకోణంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నదని తెలిపారు. ముఖ్యమంత్రి, ఆయన బావమరిది బాగోతం బయటపడకుండా కాపాడే ప్రయత్నం భట్టి చేస్తున్నారని మండిపడ్డారు. తన 40 ఏళ్ల అనుభవాన్ని ఉపయోగించి ముఖ్యమంత్రిని బొగ్గు స్కాండల్ నుంచి బయటపడేసేందుకు విఫల ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. తమ అనుయాయులకు టెండర్లు దక్కే విధంగా విధానాలు మార్చారన్నారు.