హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ) : సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో కంచ గచ్చిబౌలి భూముల గుంట నక్కలు ఎవరో ప్రజలకు తెలిసిపోయిందని బీఆర్ఎస్ విప్ కేపీ వివేకానంద చెప్పారు. పర్యావరణ చట్టాలను ఉల్లంఘించి చెట్లను నరికించిన సీఎం రేవంత్‌పై కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలను ప్రజలు స్వాగతిస్తున్నారని తెలిపారు. కోర్టుకు సెలవులు ఉన్నప్పుడు కంచ భూముల్లో చెట్టు నరికారని దుయ్యబట్టారు. రూ.10 వేల కోట్లకు కక్కుర్తి పడి ప్రజలను తప్పుదారి పట్టించారని మండిపడ్డారు. ఈ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి దొంగలా దొరికిపోయారని పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో శుక్రవారం ఎమ్మెల్యేలు కే సంజయ్, అనిల్జాదవ్తో కలిసి వివేకానంద విలేకరులతో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని, ఆ భూముల్లో చెట్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. రూ.10 వేల కోట్ల కోసం రూ.170 కోట్లను బ్రోకర్లకు ప్రభుత్వం చెల్లించిందని ఆరోపించారు. రూ.10 వేల కోట్ల రుణంపై స్వతంత్ర దర్యాప్తు జరుగాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ లేవనెత్తిన అంశాలనే సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీ (సీఈసీ) తన నివేదికలో స్పష్టం చేసిందని చెప్పకొచ్చారు. రేవంత్ సర్కార్ ఆర్థిక అవకతవకలపై ఇప్పటికే కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో తెలంగాణ ప్రీమియర్ లీగ్ (టీపీఎల్) నడుస్తున్నదని వివేకానంద ఎద్దేవా చేశారు.
తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన పుస్తకాలు రాసిన వారే గ్రూప్-1 పరీక్షలకు హాజరైతే.. వారికే ఈ పరీక్షలో ఎందుకు మార్కులు తగ్గాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ జవాబు పత్రాలను తెలంగాణ వాళ్లతో దిద్దించారా? లేక ఆంధ్రోళ్లతో దిద్దించారా?అని సందేహం వ్యక్తం చేశారు. గ్రూప్-1 ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలకు వేర్వేరుగా హాల్‌టిక్కెట్లు ఎందుకు జారీ చేశారని నిలదీశారు. కమీషన్లపై స్వయంగా క్యాబినెట్ మంత్రులే ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని మల్లు భట్టి విక్రమార్కకు అప్పగించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడాన్ని ఖండించారు. రాములు నాయక్ కోడలికి గ్రూపులో మార్కులు ఎలా వచ్చాయని ప్రశ్నించడం తప్పా? అని నిలదీశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎవరు మాట్లాడినా కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఈ కేసులకు ఎవరు భయపడడం లేదన్నారు. కేసులు పెట్టాల్సి వస్తే.. కొడంగల్ ఎన్నికల ప్రచారంలో బీరు సీసా, బిర్యాని ఇస్తే ఓట్లు వేస్తారని వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ పై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.