హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ప్రతి పౌరుడు సురక్షితంగా ఉన్నాడనే భరోసా కల్పించేందుకు పోలీసు శాఖ అవసరాలు తీర్చే బాధ్యత తాము తీసుకుంటామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సచివాలయంలో శనివారం హోంశాఖ ప్రీ బడ్జెట్ సమావేశాల్లో ఆయన పలు అంశాలపై పోలీసు ఉన్నతాధికారులతో చర్చించారు. దేశంలోనే తెలంగాణ పోలీస్ శాఖకు మంచి పేరుందని పేర్కొన్నారు. సైబర్ క్రైమ్ కేసులను పరిష్కరిస్తున్న సిబ్బందికి అభినందనలు తెలిపారు. పోలీస్ అధికారులు, సిబ్బంది నివాసానికి క్వార్టర్స్ నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. గ్రేహౌండ్స్, నారోటిక్స్, ఇంటెలిజెన్స్, ఫైర్, ఎక్స్ సర్వీస్‌మెన్ తదితర ఎనిమిది విభాగాల ఉన్నతాధికారులు వారికి కావాల్సిన బడ్జెట్ ప్రతిపాదనలను అందజేశారు. డీజీపీ జితేందర్ మొత్తం శాఖాపరంగా అవసరమైన బడ్జెట్ నివేదికను సమర్పించారు. సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవి గుప్తా, హైదరాబాద్ సిటీ కమిషనర్, డీజీ సీవీ ఆనంద్, డీజీ అభిలాష బిస్త్, గ్రేహౌండ్స్, ఆక్టోపస్ అడిషనల్ డీజీ స్టీఫెన్ రవీంద్ర, రాచకొండ సీపీ సుధీర్‌బాబు, సైబరాబాద్ సీపీ అవినాష్ మొహంతి తదితరులు పాల్గొన్నారు.