Bhatti Vikramarka | హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ భయపడిందంతా అవుతున్నది. ఆయన అనుమానమే నిజం అయ్యే ప్రమాదం వచ్చిపడింది. మూడేండ్లపాటు అష్టకష్టాలు పడి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన అత్యుత్తమ రెవెన్యూ సంస్కరణలను మొత్తం తుడిచిపెట్టేస్తామని కాంగ్రెస్ స్పష్టంగా ప్రకటించింది. ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామని చెప్తున్న కాంగ్రెస్.. దాని స్థానంలో మళ్లీ కామందుల కాలం నాటి పటేల్, పట్వారీ వ్యవస్థను తెస్తామని తేల్చిచెప్పింది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని కుండబద్ధలు కొట్టినట్టు చెప్పేశారు. ‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి స్థానంలో భూమాత తెస్తాం. ఇప్పుడున్న ధరణి ఒక సాఫ్ట్వేర్. ఇందులో పట్టాదార్ కాలం ఒక్కటే ఉన్నది. దాన్ని మొత్తం తీసేస్తాం. భూ మాత పోర్టల్‌లో గతంలో రెవెన్యూ రికార్డుల్లో ఎన్ని కాలమ్స్ ఉండేవో.. అన్నీ తెస్తాం. పట్టాదారు కాలం, కౌలుదారు కాలం.. తదితర కాలమ్స్ అన్నీ తెస్తాం’ అని భట్టి ప్రకటించారు. భట్టి మాటల అంతరార్థం మళ్లీ ధరణికి ముందు ఉన్న రెవెన్యూ వ్యవస్థను తెస్తామని. బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన రెవెన్యూ సంస్కరణలను మొత్తం ఎత్తివేస్తామని చెప్పకనే చెప్పారు.
ఉమ్మడి రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థ అంటే ఒక పద్మవ్యూహం. రికార్డుల్లో ఉండే కాలమ్స్ గురించి ఆ శాఖలో పనిచేసే ఉద్యోగులకు, వాళ్లను అనుసరించి ఉండే దళారులకు తప్ప సామాన్యులకు తెలిసేవి కావు. చాంతాడంత రికార్డుల్లో ఎక్కడ ఏ వివరం ఉందో తెలుసుకోవటం సగటు పౌరుడికి దాదాపు అసాధ్యం.. ఆ సంక్లిష్టతను ఆధారంగా చేసుకొని దళారులు చెలరేగిపోయేవారు. చిన్న పనికి కూడా నెలలు, సంవత్సరాలు తిప్పించుకొని నరకయాతన పెట్టేవారు. నాడు రైతుల గోస వర్ణనాతీతం. రాత్రికి రాత్రే ఒకరి భూమి మరొకరి పేరుపై మారిపోయేది. మళ్లీ దాన్ని సంపాదించుకోవాలంటే లంచమైనా ఇవ్వాలి.. కోర్టుల చుట్టూ అయినా తిరగాలి. నాటి పరిస్థితి ఇది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ సంక్లిష్టతను తొలగించేందుకు రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు. ఇందుకోసం మూడు నాలుగేండ్లపాటు కష్టపడ్డారు. ముందుగా భూ రికార్డులను ప్రక్షాళన చేశారు. ఆ తర్వాత అవినీతిమయమైన క్షేత్రస్థాయి రెవెన్యూ వ్యవస్థను రద్దుచేశారు. అంతమంగా సంచలనాత్మక ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చారు. ఇది వచ్చిన తర్వాత భూ యజమాని అర్థరాత్రి నిద్రలేచి కూడా ఐదు నిమిషాల్లో తన భూ రికార్డుల వివరాలను ఆన్లైన్లో చెక్చేసుకోవటం సుసాధ్యవుతున్నది. గంటలో భూ రిజిస్ట్రేషన్లు ముగుస్తున్నాయి. ధరణి పోర్టల్‌లో దేశవ్యాప్తంగా ఆసక్తి పెరిగింది. ఇలాంటి అద్భుత రెవెన్యూ సంస్కరణను ఇప్పుడు కాంగ్రెస్ తీసేస్తామని చెప్తున్నది. అంటే మళ్లీ గజిబిజి రికార్డులు, అర్థంకాని కాలమ్స్, బ్రహ్మపదార్థంలాంటి వ్యవస్థ తీసుకురాబోతున్నారు. స్పష్టంగా చెప్పాలంటే గత కాంగ్రెస్ పాలనలో ఉన్న పటేల్, పఠ్వార్వీ వ్యవస్థ మారుపేర్లతో రాబోతున్నది. మళ్లీ భూముల కోసం కయ్యాలు, కొట్లాటలు, గొడవలు మొదలు కాబోతున్నాయి. దళారులు రాజ్యమేలబోతున్నారు.
ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత ప్రభుత్వం రైతులకు అందజేస్తున్న రైతుబంధు నేరుగా భూ యజమాని ఖాతాలో పడుతున్నది. ఇప్పుడు కాంగ్రెస్ ధరణిని రద్దుచేస్తామంటున్నది. తన మ్యానిఫెస్టోలో కౌలురైతుకు నగదు ఇస్తామని ప్రకటించింది. ఆ డబ్బు రావాలంటే కౌలు రైతు తాను కౌలుకు తీసుకొన్న భూ యజమానితో చట్టప్రకారం ఒప్పందం చేసుకోవాలి. అప్పుడే అతడు కౌలు రైతుగా గుర్తింపు పొందుతాడు. సాధారణంగా తక్కువ మొత్తం భూమి ఉన్న రైతులు ఇతర రైతుల భూములను కౌలుకు తీసుకొని సాగుచేస్తుంటారు. అటు తన సొంతభూమితోపాటు, కౌలుకు తీసుకొన్న భూమిని కూడా సాగు చేస్తారు. ఈ పరిస్థితుల్లో కౌలురైతును ఎలా గుర్తిస్తారు? పోనీ భూమి లేని రైతులు ఇతరుల వద్ద కొంత భూమిని కౌలుకు తీసుకొని సాగుచేసుకొంటుంటారు. మరి రైతుబంధు ఎవరికి ఇస్తారు? భూ యజమానికా? కౌలు రైతుకా? ఒకటే భూమిపై ఇద్దరికీ ఇస్తారా? అది సాధ్యమవుతుందా? తన భూమిపై మరొకరికి రైతుబంధు (కాంగ్రెస్ దృష్టిలో మరో పేరు కావచ్చు) రావటాన్ని ఆ భూ యజమాని ఒప్పుకొంటాడా?
ఒక ఇంట్లో కిరాయికి ఉండే వ్యక్తి పేరు ఆ ఇంటిమీద రాస్తారా? అని కౌలు రైతులకు రైతుబంధు అంశంలో గతంలో సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. అలాగే భూ యజమాని తన భూమి కౌలురైతు పేరుమీద రికార్డు కావటానికి ఒప్పుకొంటారా? సమస్య ఇంతటితో ఆగదు. భూ యజమాని తన భూమిని ఎల్లకాలం ఒకే కౌలురైతుకు ఇవ్వడు. ఏడాదికో.. రెండేండ్లకో మరొకరికి కౌలుకు ఇస్తాడు. అప్పుడు రైతుబంధు ఎవరికి ఇస్తారు? కౌలురైతు మారిన ప్రతిసారి తన భూమి రికార్డులు మార్చటానికి భూ యజమాని సిద్ధపడుతాడా? ఈ కచరా వ్యవహారం ఎందుకులే అనుకొని అసలు తన భూమిని ఎవరికీ కౌలుకు ఇవ్వకుండా పడావు పెడితే పరిస్థితి ఏంటి? వ్యవసాయం చేయాలన్నా భూమి దొరక్క కౌలు రైతులు విలవిలాడిపోరా? రెండుమూడేండ్లు కౌలుకు చేసిన రైతు.. ఆ భూమిపై నుంచి తొలగిపోనని పేచీ పెడితే పరిస్థితి ఏంటి? అంటే.. కాంగ్రెస్ తేబోయే భూ మాతతో వచ్చేవన్నీ కొట్లాటలు, తండ్లాటలే. వాటిని పరిష్కరించటానికి మళ్లీ కాంగ్రెస్ నేతలే దళారుల అవతారం ఎత్తి వసూళ్లకు తెరలేపుతారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జరుగబోయేది ఇదే..