BRS | హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): సార్వత్రిక ఎన్నికల పోరుకు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సిద్ధమవుతున్నది. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాల మేరకు జనవరి 3వ తేదీ నుంచి లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సమాయత్తమవుతున్నాయి. పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు, సెక్రటరీ జనరల్ కే కేశవరావు, మాజీ స్పీకర్ మధుసూధనాచారి, మాజీ మంత్రులు హరీశ్‌రావు, కడియం శ్రీహరి, జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి తదితర ముఖ్యనాయకులు ఈ సమావేశాల్లో పాల్గొననున్నారు. తెలంగాణ భవన్ వేదికగా మొత్తం రెండు విడతల్లో 16 రోజులపాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు మొదటి విడుత సమావేశాలు జరుగుతాయి. సంక్రాంతి నేపథ్యంలో మూడురోజుల విరామం తర్వాత 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు మిగతా నియోజకవర్గాల సమావేశాలు జరుగనున్నాయి.
ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానంతో మొదలై హైదరాబాద్, సికింద్రాబాద్‌తో ఈ సమావేశాలు ముగియనున్నాయి. సమావేశాలకు ఆయా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎంపీలు, అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, జెడ్పీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మేయర్లు, మాజీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, నియోజకవర్గాల ఇన్చార్జీలు, జిల్లాపార్టీ అధ్యక్షులు, పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు హాజరు కానున్నారు. ఈ సమావేశాల్లో లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. నేతల అభిప్రాయాలు తీసుకుని పటిష్ఠమైన కార్యాచరణను రూపొందించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో చాలా చోట్ల స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన నేపథ్యంలో.. ఆయా ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. సమీక్షల అనంతరం ప్రజాక్షేత్రంలో ప్రచారపర్వాన్ని బలంగా నిర్వహించేందుకు పార్టీ యంత్రాంగం కసరత్తు చేస్తున్నది.