హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబరు 23 (నమస్తే తెలంగాణ): తమ భూములు కాపాడాలంటూ రైతులు చేస్తున్న ఆర్తనాదాలను వినని ప్రభుత్వానికి.. ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలూ చెవికెక్కడం లేదు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లిలోని 36వ సర్వే నంబర్లోని తమ భూమిని అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని ఉద్యోగులు 70 రోజులుగా నిరసన దీక్షలు చేస్తున్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు.
తాంబూలాలిచ్చాం.. తన్నుకు చావండి! అన్నట్టుగా ఉద్యోగులు, ప్రైవేటు వ్యక్తుల మధ్య చిచ్చు రేపడమే కాకుండా, ఆ మంటల్లో చలికాచుకుంటున్నది. సర్వేనంబరు 36, 37లోని 189.11 ఎకరాల ప్రభుత్వ భూమిలో 91 ఎకరాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు ప్రభుత్వ పెద్దలు గతంలోనే అధికారులతో ఇష్టానుసారంగా ఉత్తర్వులు జారీ చేయించిన సంగతి తెలిసిందే. బండారం బయటపడి రచ్చ కావడంతో తాత్కాలికంగా భూ పందేరానికి బ్రేకులు వేసిన పెద్దలు.. అదును చూసి పని కానిచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం.
మరోవైపు ఎప్పటికైనా తమకు ఇండ్లస్థలాలు రాకపోతాయా? అని ఏండ్ల తరబడి ఎదురుచూస్తున్న భాగ్యనగర్ టీఎన్జీవో ఉద్యోగుల కుటుంబాలు కాంగ్రెస్ సర్కారు తీరుతో నిత్యం నరకం అనుభవిస్తున్నారు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జీహెచ్ఎంసీకి రూ.18 కోట్లు చెల్లించి అధికారికంగా లేఅవుట్ చేసి ప్లాట్లను కొంతమేర ఉద్యోగులకు పంపిణీ చేసుకున్నారు. ఇదే భూమిలో ప్రైవేటు వ్యక్తులు తిష్ఠవేసి రెండు నెలలు దాటుతున్నా అధికార యంత్రాంగం కనీసం కన్నెత్తి చూడటం లేదని బాధిత ఉద్యోగులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. భాగ్యనగర్ టీఎన్జీవో నియమించుకున్న సెక్యూరిటీ గార్డులకు సైతం తుపాకులు గురిపెట్టి భయభ్రాంతులకు గురిచేసి, అనుమతులు తీసుకోకుండానే 100 ఫీట్ల రోడ్లు వేసి, ఫెన్సింగ్‌తో ఆ భూమిని ప్రైవేటు వ్యక్తులు స్వాధీనం చేసుకోవడంతో ఉద్యోగుల కంటిమీద కునుకే కరువైంది.
ప్రజల సమస్యలను తీర్చే వివిధ శాఖల ఉద్యోగులకే (అధికారులు) జీవన్మరణ సమస్య వచ్చిపడింది. ఏపీ ఎన్జీవో నుంచి భాగ్యనగర్ టీఎన్జీవోగా మారడం, ఇతర పరిణామాల నేపథ్యంలో ఉద్యోగస్తులకు ప్లాట్లు దక్కలేదు. కానీ ఈ భూమి చుట్టూ టీఎన్జీవో, సచివాలయ ఉద్యోగులు ఎన్నో ఏండ్ల కిందట ప్రభుత్వం ద్వారా పొందిన భూమిలో ప్లాట్లు వేసుకొని ఇండ్లు కట్టుకొని సాఫీగా ఉంటున్నారు. కానీ తమ పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగా తయారైందని, 70 రోజులుగా తాము ఆందోళన బాటపట్టినా కనీసం ఓ ఉన్నతాధికారిగానీ, మంత్రులు, ఎమ్మెల్యేలు గానీ తమ వైపు కన్నెత్తి చూడకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ భూమి భాగ్యనగర్ టీఎన్జీవోలకు చెందినదేనని అధికారులు నివేదిక ఇవ్వడమే కాకుండా మూడో వ్యక్తికి భూమిని బదలాయించవద్దని స్పష్టంగా హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ రంగారెడ్డి జిల్లా అధికారులు యథేచ్ఛగా వాటిని ఉల్లంఘించడం అందరినీ విస్మయానికి గురి చేస్తున్నదని పేర్కొన్నారు. కోర్టులంటే కూడా అధికారులకు లెక్కలేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించే వరకు తమ ఆందోళనను విరమించేదిలేదని ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు.
తమ భూమిని కాపాడుకునేందుకు ఉద్యోగులు 70 రోజులుగా సర్వేనంబరు 36లో నిరసన దీక్షలు కొనసాగిస్తున్నారు. టెంటు తీసివేయాలని ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి వస్తున్నా, వారు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇప్పుడు వెనుకడుగు వేస్తే ఎన్నో ఏండ్లుగా ఆశలు పెట్టుకున్న భూమి ప్రైవేటు వ్యక్తులపరం అవుతుందనే భయాందోళనలో ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పదేండ్లపాటు ఆ భూమి జోలికి ఎవరూ రాలేదని, దీంతో ఎప్పటికైనా భూమి తమకు వస్తుందనే ధీమా ఉండేదని, కానీ ఇప్పుడు రాత్రికి రాత్రే భూమి ఎవరిపరం అవుతుందోననే అయోమయ పరిస్థితి నెలకొన్నదని ఉద్యోగులు వాపోతున్నారు.