బడంగ్పేట్, జూన్ 1 : నాడు ఉద్యమనేతగా కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష, ఎంతోమంది విద్యార్థుల త్యాగాలతో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవించిందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పీ సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చు డో’ అన్న నినాదంతో తెలంగాణ పోరాటం అగ్నికణంగా ఎగిసి పడిందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సబండ వర్గాలు సమర శంఖారావం పూరించాయని గుర్తుచేశారు. కేసీఆర్ నాయకత్వంలో అన్నివర్గాల ప్రజలు ముందుకు సాగి కేంద్రం మెడలు వంచి తెలంగాణను సాధించారని తెలిపారు. వంటావార్పు, సడక్ బంద్, రైల్‌రోకో, మానవహారాలు, ఆమరణ నిరాహార దీక్షలు, ధర్నాలు, రాస్తారోకోలు, ధూమ్ ధామ్ కళాప్రదర్శనలతో ఆనాడు తెలంగాణ రాష్ట్రమంతా దద్దరిల్లిపోయిందని పేర్కొన్నారు.
చావు నోట్లో తలపెట్టి రాష్ర్టాన్ని సాధించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని గుర్తుచేశారు. పదేండ్ల తన పాలనా కాలంలో సీఎంగా కేసీఆర్ అన్నిరంగాల్లో రాష్ర్టాన్ని అభివృద్ధి చేసి, బంగారు తెలంగాణ తీర్చిదిద్దారని పేర్కొన్నారు. ఈ ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం మళ్లీ అధోగతి పాలవుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్న ప్రజలకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గ వ్యాప్తంగా ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు. అమరవీరులకు నివాళులు అర్పించాలని సూచించారు. వేడుకల సంద ర్భంగా జాతీయ జెండాను, బీఆర్ఎస్ జెండాను ఎగురవేసి సంబురాలు చేసుకోవా లని సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు.