హైదరాబాద్, జూన్16 (నమస్తే తెలంగాణ): ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అమలు చేస్తున్న బెస్ట్ అవైలబుల్ స్కీమ్‌కు సంబంధించి బకాయిలను ప్రభుత్వం తక్షణం విడుదల చేయాలని తెలంగాణ గిరిజన సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ధర్మనాయక్, ఆర్ శ్రీరాంనాయక్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకానికి నిధులు విడుదల చేయడం లేదని మండిపడ్డారు. ఈ కారణంగా పలు ప్రైవేట్ పాఠశాలల, పేద విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం ఆ బకాయిలను విడుదల చేయాలని, లేకుంటే దళిత గిరిజన సంఘాలు, విద్యార్థిసంఘాలను కలుపుకొని రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి పూనుకుంటామని ఆ ప్రకటనలో హెచ్చరించారు.