భూత్పూర్, జూన్ 30 : ఆసరా పింఛన్లు వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం వెల్కిచర్లలో వృద్ధులు, వితంతువులు నాగర్కర్నూల్- మహబూబ్నగర్ రోడ్డుపై మంగళవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ.. జూన్ 1 తర్వాత చెల్లించాల్సిన పింఛన్లు 30వ తేదీ వచ్చినా చెల్లించడంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. పంచాయతీ కార్యదర్శి మహేశ్యాదవ్ అక్కడికి చేరుకొని లబ్ధిదారులకు సర్దిచెప్పారు.
జూన్ నెలకు సంబంధించిన పింఛన్ డబ్బులు మంజూరయ్యాయని, బ్యాంక్లో నుంచి డబ్బులు డ్రా చేయడానికి లిక్విడ్ అమౌంట్ లేనందున ఇబ్బందులు ఎదురైనట్టు తెలిపారు. వెల్కిచర్ల వనపర్తి డివిజన్ పోస్టాఫీస్ పరిధిలో ఉండటం వలన కూడా ఇబ్బంది అవుతున్నదని చెప్పారు. డీపీఎం రామునాయక్ వెల్కిచర్ల గ్రామ పంచాయతీ కార్యాలయానికి వచ్చి లబ్ధిదారులతో మాట్లాడారు. పింఛన్లను బ్యాంక్ ఖాతాకు జమచేసే ఆలోచన ఉన్నట్టు తెలిపారు.