షాబాద్, జనవరి 31: కాంగ్రెస్(Congress) ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీల్లో భాగంగా ఆసరా పింఛన్లను(Aasara Pension) రూ.4వేలకు పెంచుతామని ప్రకటించింది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచినా ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో లబ్ధిదారుల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం అరకొర పింఛన్లు అందజేశారు. అప్పట్లో వృద్దులు పింఛన్ల కోసం ఎన్ని దరఖాస్తులు పెట్టుకున్న పింఛన్లు మంజూరు అయ్యేవి కాదు. ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరిగిన పింఛన్లు రాకపోయేవి. స్వరాష్ట్రంలో కేసీఆర్ హాయంలో ఆసరా పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులందరికీ పింఛన్లు మంజూరు చేశారు.
రంగారెడ్డి జిల్లాలో సుమారు 2లక్షలకు పైగా లబ్ధిదారులకు ప్రతినెల పింఛన్లు అందించారు. అప్పట్లో రూ.200 ఉన్న పింఛన్‌ను రూ.1000కి పెంచారు. రెండో విడత అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం రూ.1000 ఉన్న పింఛన్‌ను రూ.2వేలకు పెంచి వృద్దులకు కేసీఆర్ అండగా నిలిచారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో కేసీఆర్ ఇచ్చిన పింఛన్లే ఇస్తున్నారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రూ.4వేలు అందించడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఏడాదిగా ఎదురుచూపు..!
రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా ఏడాదిగా పింఛన్ల పెంపు కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. జిల్లాలోని చేవెళ్ల, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలోని 25 మండలాల్లోని గ్రామాల్లో మొత్తం 2.08లక్షల మంది ఆసరా పింఛన్ లబ్ధిదారులున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆసరా పింఛన్లతో అభాగ్యులకు చేయూత అందించింది. వృద్ధులు, వితంతువులు, గీత, చేనేత, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలకు నెలకు రూ.2016, దివ్యాంగులకు రూ.4016ను పంపిణీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేస్తే ఆసరా పింఛన్‌దారులకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ ఏడాది సంక్రాంతి పండుగకైనా పింఛన్ల పెరుగుదల ప్రకటన వస్తుందని ఆశించినా లబ్ధిదారులకు నిరాశే మిగిలింది.
మాట నిలబెట్టుకోవాలంటున్న లబ్ధిదారులు
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పింఛన్లు రెట్టింపు చేసి మాట నిలబెట్టుకోవాలని లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్లు పెంచుతామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏడాది గడిచినా ఇప్పటివరకు పెంచలేదని వాపోతున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చిన రూ.2వేల పింఛన్లే ఇస్తున్నారని చెబుతున్నారు. రూ.2016 ఉన్న పింఛన్ రూ.4016 వెంటనే అందించి మాట నిలబెట్టుకోవాలని కోరుతున్నారు.