పెంట్లవెల్లి, జూలై 1 : తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ ఓ నిరుపేద కలెక్టర్ కాళ్లపై వేడుకోగా పోలీసులు చితకబాదిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. పెంట్లవెల్లి మండలం జటప్రోలులో యంగ్ ఇండియా స్కూల్ పనులు పరిశీలించేందుకు సోమవారం కలెక్టర్ హేమంత్‌కేశవ్ పాటిల్ వెళ్లారు. ఈ క్రమంలో తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కటికె నారాయణ కలెక్టర్ కాళ్లపై పడి వేడుకున్నాడు.
అధికార పార్టీ నాయకుల ఒత్తిడి మేరకు అదేరోజు సాయంత్రం నారాయణను పోలీసులు స్టేషన్‌కు తరలించి దారుణంగా కొట్టారని సమాచారం. ఎందుకు కొడుతున్నారు సార్.. అని అడిగితే కలెక్టర్‌కు అవమానం జరిగిందం టూ.. దుర్భాషలాడుతూ దారుణంగా కొట్టారని బాధితుడు వాపోయాడు. బుధవారం కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి గోప్లాపూర్‌లో పరామర్శకు వెళ్లగా.. బాధితుడు నారాయణ కలిసి జరిగిన విషయం వివరించాడు. స్పందించిన మాజీ ఎమ్మెల్యే బాధ్యులైన పోలీసులపై కోర్టులో కేసు వేస్తామని భరోసా కల్పించారు.