హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ దవాఖానల్లో సిబ్బంది, మందులు అందుబాటులో లేకుంటే కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను హెచ్చరించారు. సీజనల్ వ్యాధులు, వైద్య విధాన పరిషత్‌ను డైరెక్టర్ ఆఫ్ హెల్త్‌కేర్‌గా బలోపేతం చేయడంపై సచివాలయంలో శుక్రవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందిస్తున్న సేవల బలోపేతంపై చర్చించారు. గిరిజన ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు విస్తరించకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌ను ఆదేశించారు. సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ ఆర్వీ కర్ణన్, టీజీఎంఎస్ఐడీసీ ఎండీ హేమంత్ వాసుదేవరావు, డీఎంఈ డాక్టర్ వాణి, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రవీందర్ నాయక్, వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్, డిప్యూటీ డీఎంఈ విమల థామస్ పాల్గొన్నారు.