హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరగాళ్లు రోజు రోజుకూ రెచ్చిపోతున్నారు. డిజిటల్ అరెస్టు పేరుతో ఇటీవల నిజామాబాద్‌లోని వి నాయక్‌నగర్‌లో 78 ఏండ్ల వృద్ధుడిని బెదిరించి రూ.30 లక్షలు తమ ఖాతాలోకి బదిలీ చేయించుకున్నారు. ఆ తర్వాత ఆయన బ్యాంకు లాకర్లో బంగా రం ఉందని తెలుసుకుని దానిపై లోన్ తీసుకోవాలని ఒత్తిడి పెంచారు. దీంతో ఆ బంగారాన్ని కుదవ పెట్టేందుకు సదరు వృద్ధుడు తన స్నేహితుడిని సంప్రదించడంతో అదంతా మోసమని గుర్తించారు. ఆ వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయడంతోపాటు నిజామాబాద్ సైబర్ క్రైమ్‌ను సంప్రదించారు. అధికారులు.. నేరస్థుల ఖాతాలోని రూ.20 లక్షలను విత్‌డ్రా చేసుకోకుండా ఆపేశారు. డిజిటల్ అరెస్టుల పేరు తో జరిగే సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (సీఎస్బీ) డైరెక్టర్ శిఖా గోయెల్ మరోసారి సూచించారు. కేసుల విచారణ లేదా బ్యాంక్ ఖాతాలు, ఆధార్ వివరాల కోసం పోలీసులు, సీబీఐ, ఆర్బీఐ, ఈడీ అధికారులు వాట్సాప్ కాల్స్ ద్వారా సంప్రదించరని తెలిపారు. ఎవరికీ డబ్బులు బదిలీ చేయొద్దని, బ్యాంకు, లాకర్ వివరాలు వెల్లడించొద్దని స్పష్టం చేశారు. అనుమానాస్పద కాల్స్ లేదా మెసేజ్‌లు వస్తే వెంటనే 1930కి కాల్ చేసి రిపోర్టు చేయాలని సూచించారు.