CM KCR | ప్రజలు ఆలోచించి ఎన్నికల్లో ఓటు వేయాలని.. లేకపోతే ఆ ఓటే కాటేస్తే ప్రమాదం ఉంటుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు హెచ్చరించారు. మెదక్ నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు హాజరయ్యారు. మరోసారి కారు గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యేగా పద్మాదేవేందర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఎలక్షన్ వచ్చిందంటే ఆగమాగం అడివడివి. అబద్ధాలు చెప్పడం. అబాంఢాలు వేయడం. ఇష్టమైన ప్రచారాలు చేయడం. వాగ్ధానాలు చేయడం. జనాల్ని మోసం చేసే పని నడుస్తుంటుంది. ఇది ప్రజాస్వామ్య పరిణితికి మంచిది కాదు. 75 సంవత్సరాల భారతంలో మన ప్రజాస్వామ్య ప్రక్రియలో రావాల్సినంత పరిణితి రాలేదు. ఇంకా రావాల్సిన అవసరం ఉన్నది’ అన్నారు.
‘ఎన్నికల్లో అభ్యర్థుల చరిత్రను చూడాలి. దానికంటే ముఖ్యంగా పెద్ద పార్టీలున్నయ్. ఆ పార్టీల చరిత్ర, వైఖరి, నడవడిక, పార్టీ అధికారం ఇస్తే ఏం చేశారు ? ఏం చేయలేదనేది గమనించాలని కోరుతున్నా. పార్టీల నడవడికన పరిశీలిస్తే మంచీచెడు తెలుస్తుంది. ఓటు మంచివాళ్లకు వేస్తే మంచి జరుగుతుంది. 30 తారీఖున ఎట్లయిన ఓట్లుపడుతయ్. 3న లెక్కపెడుతరు. ఆడికిపోదు కథ. ఇక్కడ ఏ ఎమ్మెల్యే గెలిస్తే హైదరాబాద్‌లో ఆ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఓటు అనేది తలరాతను రాస్తుంది. జాగ్రత్తగా ఆలోచించి వస్తే లాభం జరిగే అవకాశం ఉంటుంది. లేకపోతే ఆ ఓటే కాటేసే అవకాశం ఉంటది. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ రాష్ట్ర సాధన, తెలంగాణ ప్రజల హక్కుల సాధన కోసం. ఈ విషయం మీకు తెలుసు. బీఆర్ఎస్ మీ ముందే పుట్టింది.. ప్రభుత్వంగా పని చేసింది. కాంగ్రెస్‌కు 50 ఏళ్ల చరిత్ర ఉన్నది. తెలంగాణ వచ్చిన సమయంలో గందరగోళమైన పరిస్థితులుండే. అవన్నీ సరిచేసి పదేళ్లలో బీఆర్ఎస్ ఏం చేసిందో మీ కండ్లముందున్నది. పేదల సంక్షేమం, కరెంటు, రైతులు, సాగునీరు, పరిశ్రమలు, ఐటీరంగం వీటిపై దృష్టిపెట్టి పని చేసింది బీఆర్ఎస్’ అని తెలిపారు.
‘సంక్షేమంలో మనం ఇండియాలోనే నెంబర్ వన్. మనకు ఎవరూ సాటిలేరు. చాలా అద్భుతమైన సంక్షేమం ఇస్తున్నాం. రైతుల గురించి ఆలోచిస్తే ఐదు కార్యక్రమాలను తీసుకున్నాం. ఇదే మెదక్‌కు వచ్చిన సందర్భంలో అప్పటి కలెక్టర్ చెప్పారు. నీటి తీరువా బకాయిలు ఉన్నయ్. రైతులు బాధపడుతున్నరు. వాటిని మాఫీ చేయాలని ఆయన చెప్పారు. మా మంత్రి హరీశ్‌రావు చెప్పిండు. వాటిని రద్దు చేశాం. నీళ్లకు ట్యాక్స్ లేదు. ఘనపురం ఆనకట్ట ద్వారా తీసుకున్న నీళ్లకు ట్యాక్స్ లేదు. కాళేశ్వరం నీళ్లు వచ్చినా ట్యాక్స్ లేదు. మంచినాణ్యమైన కరెంటు 24 గంటలు ఉచితంగా ఇస్తున్నం. రైతుబంధు పెట్టుబడి ఇస్తున్నం. పండించిన ధాన్యాన్ని నష్టం వచ్చినా ప్రభుత్వమే కొంటున్నది. రైతుబీమా అందజేస్తున్నాం. కానీ పెద్ద ప్రమాదం వచ్చే అవకాశం ఉన్నది’ అంటూ హెచ్చరించారు.
‘కాంగ్రెస్ పార్టీ వాళ్లు మాట్లాడుతున్నరు. కేసీఆర్‌కు పని లేదు. ప్రజలు కట్టిన పన్నులన్నీ రైతుబంధు ఇచ్చి దుబార చేస్తున్నడని మాట్లాడుతున్నరు. రైతుబంధు ఉండాల్నా వద్దా ? రైతుబంధు ఉండాలంటే పద్మాదేవేంద్‌రెడ్డి గెలవాలి. రైతుబంధు ఉండుడు కాదు.. పద్మాదేవేందర్‌రెడ్డిని గెలిపిస్తే రూ.16వేలు అవుతుంది. ఏది కావాలో తేల్చుకోవాలి. రైతులకు వ్యవసాయానికి 24 గంటల కరెంటు కూడా వేస్ట్. కేసీఆర్ డబ్బులన్నీ దండగ చేస్తున్నడని మాట్లాడుతున్నడు. మరి 24గంటల కరెంటు వేస్టా? పీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతున్నడు మూడు గంటల కరెంటు సరిపోతుందటా? మూడుగంటలకు మడి తడుస్తుందా ? దానికి ఆయన చెప్పే సిద్ధాంతం.. మూడుగంటల కరెంటు చాలూ.. పది హెచ్‌పీల మోటర్ పెట్టుకోవాలట? మరి రైతుల దగ్గర పది హెచ్‌పీల మోటర్ ఉంటదా? 3, 5 హెచ్‌పీల మోటర్లు మనదగ్గర ఉంటయ్. మరి రైతులదగ్గర 30లక్షల మోటర్లు ఉన్నయ్. మరి వాటిని మార్చాలంటే డబ్బులు ఎవడు ఇవ్వాలి..? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.