హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. భారీ వర్షాల కారణంగా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వానాకాలంలో పంటనష్టం జరగకుండా తగిన చర్యలు చేపట్టాలని అన్నారు. అకాల వర్షాల వల్ల ధాన్యానికి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా ఇన్చార్జి మంత్రులతో కలిసి.. భారీ వర్షాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు తెలియచేయాలని సూచించారు. ఈ సమావేశంలో డీజీ ఫైర్ సర్వీసెస్ నాగిరెడ్డి, సివిల్ సప్లయీస్ ముఖ్య కార్యదర్శి డీఎస్ చౌహాన్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపీ, హైదరాబాద్ వాటర్వర్క్స్ ఎండీ అశోక్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
హైదరాబాద్ మే 22 (నమస్తే తెలంగాణ): అకాల వర్షాలతో తెలంగాణలోని రైతాంగం అతలాకుతలమైందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తంచేశారు. సకాలంలో వడ్లను కొనుగోలు చేయకుండా కాంగ్రెస్ సర్కారు అన్నదాతకు కన్నీటి వ్య థను మిగిల్చిందని గురువారం ఎక్స్ వేదిక గా మండిపడ్డారు. ఎద్దు ఏడ్చిన ఎవుసం. .రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని గుర్తుపెట్టుకొని నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. వర్షాలతో తడిసిపోయిన లక్ష టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.