బీసీల అనుమానమే నిజమైంది. సర్కారు మోసం బయటపడింది. ఏడాదిగా ఊరిస్తూ వచ్చిన సర్కారు.. బీసీలను నయవంచనకు గురిచేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ హామీని అటుంచితే, కనీసం గత ఎన్నికల్లో ఇచ్చిన రిజర్వేషన్ల కంటే కూడా తక్కువ శాతమే ఇచ్చేందుకు సిద్ధమైన్టటు తేలింది. దీంతో తాము మోసపోయామని తెలుసుకున్న బీసీలు ఇక పోరాటమే శరణ్యమని నిర్ణయించుకున్నారు. మంగళవారమే భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.
హైదరాబాద్, ఫిబ్రవరి10 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను స్థిరీకరిస్తూ రూపొందించిన నివేదికను డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వర్లు ప్రభుత్వానికి అందజేశారు. సచిలవాయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి సోమవారం ఆ నివేదికను సమర్పించారు. రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు విధించిన 50% సీలింగ్ మార్గదర్శకాలకు అనుగుణంగానే రిజర్వేషన్లను ఖరారు చేసినట్టు తెలుస్తున్నది. దీంతో బీసీల రిజర్వేషన్లు గతం కంటే తగ్గినట్టు విశ్వసనీయ సమాచారం. వాస్తవంగా స్థానిక సంస్థల్లో కేవలం ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే రాజ్యాంగపరమైన రిజర్వేషన్లు ఉన్నాయి. బీసీలకు రాజ్యాంగపరమైన చట్టబద్ధత కలిగిన రిజర్వేషన్లు ఏమీ లేవు. ఇప్పటివరకు కేవలం ఆర్టికల్స్ 243-డీ(6), 243-టీ(6) ప్రకారమే ఇతమిద్దంగా, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఇష్టానుసారం రిజర్వేషన్లను కలిస్తూ వస్తున్నాయి.
ఇలా బీసీలు, ఎంబీసీ వర్గాలకు స్థానికసంస్థల్లో రిజర్వేషన్లను కల్పించడానికి ప్రత్యేకంగా డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని, కమిషన్ సిఫారసులు లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ బీసీలకు రిజర్వేషన్లను కల్పించవద్దని తేల్చిచెబుతూ ట్రిపుల్ టీ పేరిట సుప్రీంకోర్టు గతంలోనే మార్గదర్శకాలను జారీచేసింది. ఆ రిజర్వేషన్లు కూడా 50 శాతానికి మించకూడదనే షరతును కూడా విధించింది. ఆ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం బూసాని వెంకటేశ్వర్లు నేతృత్వంలో ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ తాజాగా బీసీ రిజర్వేషన్లను స్థిరీకరిస్తూ ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది.
ఈ నివేదికపై త్వరలోనే క్యాబినెట్లో చర్చించి ఆమోదించే అవకాశం ఉన్నదని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. బీసీల రిజర్వేషన్లలో గతం కంటే కోత పడిందని విశ్వసనీయ సమాచారం. 2019 ఎన్నికల్లో సర్పంచ్ స్థానాల్లో బీసీలకు 22.78% రిజర్వేషన్‌ను అమలుచేశారు. ప్రస్తుతం అదే బీసీలకు 21% కంటే తక్కువకే ఆ పదవులు పరిమితం అవుతాయని విశ్వసనీయ సమాచారం. పదవుల రిజర్వేషన్ల శాతాల్లోనూ కోత పడిందని తెలుస్తున్నది.
స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలు విషయంలో కాంగ్రెస్ సర్కారు వైఖరిపై బీసీ సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో భాగంగా కులగణన చేసి, 42% రిజర్వేషన్లను కల్పిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ మేరకు డెడికేటెడ్ కమిషన్ నివేదిక సమర్పిస్తుందని సంఘాల నేతలు ఆశించారు. కానీ ప్రభుత్వం ఇప్పటికే 42% రిజర్వేషన్ కల్పన సాధ్యంకాదని, పార్టీ పరంగానే సీట్లను కేటాయిస్తామని ప్రకటించడంతోనే బీసీ సంఘాల నేతల్లో ఆగ్రహం కట్టలు తెంచుకున్నది.
తాజాగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఎత్తిచూపుతూ ఆ మేరకే రిజర్వేషన్లను ఖరారు చేయడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేస్తున్నారు. దీంతో ప్రభుత్వంపై పోరుకు సమాయత్తం అవుతున్నారు. ఈ మేరకు మంగళవారం భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.