వంగూరు, డిసెంబర్ 5 : సీఎం రేవంత్‌రెడ్డి సొంతూరు నాగర్‌కర్నూల్ జిల్లా వం గూరు మండలం కొండారెడ్డిపల్లిలో బీసీలకు చుక్కెదురైంది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని స్వయాన సీఎం ప్రకటించారు. కోర్టులో కేసు తర్వాత పార్టీపరంగా ఇస్తామని చెప్పి నేడు ఆయన సొంతూరులోనే మొండిచె య్యి చూపారని బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. కొండారెడ్డిపల్లి సర్పంచ్ స్థానం ఎస్సీలకు రిజర్వ్ కావడంతో మల్లెపాకుల వెంకటయ్య సర్పంచ్‌గా.. 10 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. ఎస్సీ సర్పంచ్ కావడంతో ఉపసర్పంచ్ దక్కుతుందని బీసీలు గంపెడాశలు పెట్టుకున్నారు. సీఎం సోదరుడు కృష్ణారెడ్డితో ఉపసర్పంచ్ పదవి కావాలని బీసీలు మొరపెట్టుకున్నారు. కానీ బీసీలకు కాకుండా అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తిని ఉపసర్పంచ్‌గా ఎన్నుకున్నారు. ఎన్నికైన వ్యక్తి గతంలో వరుసగా రెండు పర్యాయాలు ఉపసర్పంచ్‌గా పనిచేశాడు. మళ్లా అతడినే ఎన్నుకోవడంతో మండలంలోని బీసీ సంఘాలతోపాటు గ్రామానికి చెందిన పలువురు బీసీ నేతలు భగ్గుమంటున్నారు.