కడ్తాల్, ఆగస్టు 26: జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని, లేని పక్షంలో బీసీల ఉద్యమాలతో రాష్ట్రం రణరంగం అవుతుందని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రోళ్ల రాఘవేందర్ అధ్యక్షతన సోమవారం మైసిగండి గ్రామంలో నిర్వహించిన బీసీల రాష్ట్ర స్థాయి సదస్సులో ఆయన మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లును పార్లమెంట్లో ఆమోదించేందుకు అన్ని రాజకీయ పార్టీలు స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశ జనాభాలో దాదాపు సగం మేరకు ఉన్న బీసీల అభివృద్ధి గురించి ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ ఆలోచించలేదని విమర్శించారు. ప్రజాస్వామ దేశంలో బీసీలు బిచ్చగాళ్లు కాదని వాటాదారులని, బీసీలకు అన్యాయం చేస్తే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.
బీసీల రిజర్వేషన్లను చట్టసభల్లో 50 శాతానికి, విద్య, ఉద్యోగాల్లో 56 శాతానికి పెంచాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి, ఏటా రూ.2 లక్షల కోట్లు కేటాయిచాలని కోరారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే కులగణనను చేపట్టి, బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని, ఆ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఎన్నికలను అడ్డుకుంటామని, ప్రతి నియోజకవర్గంలో బహిరంగ సభలను నిర్వహించి ప్రభుత్వం తీరును ఎండగడతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అఖిల భారత బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి నందగోపాల్, బీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాఘవేందర్, ఉపాధ్యక్షుడు పెద్దయ్యయాదవ్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ, కన్వీనర్ భాస్కర్, బీసీ రక్షక్ దళ్ నాయకులు ఉదయ్ నేత తదితరులు పాల్గొన్నారు.