కరీంనగర్ నెట్వర్క్, డిసెంబర్ 5: బీసీ బిడ్డ సాయి ఈశ్వరాచారి ఆత్మహత్యకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని, బీసీ రిజర్వేషన్ల పేరిట బీసీలకు అన్యాయం చేయడంతోనే బలవన్మరణానికి పాల్పడ్డాడని బీఆర్ఎస్, బీసీ సంఘం నేతల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈశ్వరాచారి మృతికి సంతాపంగా శుక్రవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలుచోట్ల నివాళులర్పించారు. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని ఫూలే విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ఈశ్వరాచారి సాయి మృతికి సంతాపంగా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు కొవ్వత్తులతో ర్యాలీ తీసి నివాళులర్పించారు.
పెద్దపల్లి జిల్లా బీసీ జేఏసీ చైర్పర్సన్ దాసరి ఉష, నాయకులు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం నుంచి అమరవీరుల స్థూపం వరకు కొవ్వత్తులతో ర్యాలీగా వెళ్లి నివాళులర్పించారు. పెద్దపల్లిలో జెండా చౌరస్తాలో బీసీ సంఘం రాష్ట్ర నాయకుడు శ్రీమన్నారాయణ, నేతలు కొవ్వత్తులతో ర్యాలీ తీశారు. కరీంనగర్‌లోని శాతవాహన వర్సిటీ ఎదుట పూలే విగ్రహం వద్ద సాయి బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ప్రకాశ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాజు, నేతలు కొవ్వత్తుల ర్యాలీ నిర్వహించారు.
బీసీ రిజర్వేషన్ల అమలులో ప్రభుత్వ కాలయాపనతోనే ఈశ్వరాచారి ఆత్మహత్య చేసుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్‌లో రాస్తారోకో చేశారు. సాయి ఈశ్వరాచారి ఆత్మహత్యకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.