Jajula Srinivas Goud | వనస్థలిపురం, ఫిబ్రవరి 15: దేశ ప్రధాని నరేంద్ర మోదీ కన్వర్టెడ్ బీసీ అని కాంగ్రెస్ అంటే, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీది ఏ కులమో చెప్పాలని బీజేపీ ఎదురు దాడి చేస్తున్నదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. ఈ రెండు పార్టీల నేతలు ఒకరిపై మరొకరు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకోవడం ఆపేయాలన్నారు. నిజంగా దేశ ప్రజలకు వాస్తవాలు తెలువాలంటే కేంద్ర ప్రభుత్వం తక్షణమే అధికారికంగా దేశవ్యాప్తంగా కులగణన నిర్వహిస్తే మోదీ, రాహుల్ గాంధీ కులమేందో అధికారికంగా తెలుస్తుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
శనివారం ఎల్బీనగర్లో జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు, మాజీ ఎంపీ బొమ్మగాని ధర్మ బిక్షం గారి 103వ జయంతి కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ.. నిజాం రాజులకు, రజాకార్లకు వ్యతిరేకంగా జరిగిన భూమి, భుక్తి విముక్తి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం తెలంగాణ జాతి ఏనాటికి మరువలేనిదన్నారు. సాయుధ పోరాటంలో ముఖ్య భూమిక పోషించిన ధర్మభిక్షం ధైర్యసహసాలు అందరికీ స్ఫూర్తి నింపుతాయన్నారు. రెండు సార్లు పార్లమెంట్ సభ్యునిగా, ఎమ్మెల్యేగా సుదీర్ఘకాలం బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన గొప్ప యోధుడు ధర్మబిక్షం అని ఆయన అన్నారు. ధర్మ భిక్షం స్ఫూర్తిగా రాష్ట్రంలోని బీసీలందరూ ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కులగణన ఉద్యమం, స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు తదితర డిమాండ్ల సాధన కోసం తాము నిర్విరామంగా పోరాటం చేస్తున్నామని చెప్పారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా దక్కాలంటే గల్లీలో ఉన్న కాంగ్రెస్, ఢిల్లీలో ఉన్న బీజేపీ పార్టీలు చిత్తశుద్ధితో వ్యవహరిస్తేనే సాధ్యమవుతుందని జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. గురువారం గాంధీభవన్‌లో కులగణన లెక్కలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ నిజంగా ఓబీసీ కాదని, కన్వర్టెడ్ బీసీ అని తాను గుజరాత్లో సీఎంగా ఉన్న కాలంలో అధికారంతో ఓబీసీ జాబితాలో తమ కులాన్ని కలుపుకున్నాడని ఆరోపించారని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. దీనికి కౌంటర్‌గా బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రధాని బీసీ కాదంటే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీది ఏ కులమో తెలపాలని సవాల్ విసిరారని గుర్తు చేశారు.
ప్రధాని మోదీ కులంపై నిజానిజాలు దేశ ప్రజలకు తెలువాలన్నా, రాహుల్ గాంధీ కులమేదో ప్రజలకు తెలువాలన్న కేంద్ర ప్రభుత్వం తక్షణమే దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. దేశవ్యాప్త కులగణన ద్వారానే వీరు ఏ కులమో, అలాగే వీరి కులం నిజమా కాదా ? అనే విషయాలు వాస్తవాలు దేశ ప్రజలకు తెలుస్తాయని అన్నారు. ఇకనైనా రాజకీయ పార్టీలు బీసీలను బలి పశువులు చేయకుండా బీసీలపై నిజంగా రెండు పార్టీలకు ప్రేమ ఉంటే రాష్ట్రంలో బీసీల లెక్కలను రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా నిర్వహించాలన్నారు. అలాగే రాష్ట్ర అసెంబ్లీలో 42 శాతం రిజర్వేషన్ల పెంపు కోసం చట్టం చేయాలని, అదేవిధంగా ఈ చట్టం అమలు కోసం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదింపజేసి 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో తెలంగాణలో బీసీలంతా ఏకమై అగ్గి మండిస్తారని హెచ్చరించారు
ఈ కార్యక్రమంలో గౌడ సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్, బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఎస్ దుర్గయ్య, బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షులు కనకాల రామ్ కురుమ, బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు రఘురాం నేత, సోషల్ జస్టిస్ పార్టీ అధ్యక్షులు పిడికిలి రాజు, నాయకులు ఆయిల వెంకన్న, నీళ్ల లింగస్వామి గౌడ్, రావులకోల్ నరేష్ ప్రజాపతి, జాజుల లింగం, ఈడిగ శ్రీనివాస్, పానుగంటి విజయ్, బొంగు వెంకటేష్ గౌడ్, పాండు, అనిల్ తదితరులు పాల్గొన్నారు.