హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ) : బీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లను చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని, అప్పటి వరకు ఎన్నికల తెరువుకు పోవద్దన్న డిమాండ్‌తో కరీంనగర్లో ఈ నెల 14న బీసీ గర్జన పేరుతో భారీ సభ నిర్వహించనున్నట్టు బీఆర్ఎస్లోని బీసీ నేతలు ప్రకటించారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు కల్పించకుండా కుటిల రాజకీయాలకు తెరలేపిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టడం కోసం రాష్ట్రవ్యాప్తంగా బీసీల సత్తా చాటుతామని పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో గురువారం శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, వీ శ్రీనివాసగౌడ్ అధ్యక్షతన బీఆర్ఎస్ బీసీ నేతలు సమావేశమయ్యారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, వీ శ్రీనివాసగౌడ్‌తో కలిసి మధుసూదనాచారి మాట్లాడారు.
బీసీలకు రిజర్వేషన్లు కల్పించక పోవడం, కాంగ్రెస్ ద్రోహానికి పరాకాష్ట అని మధుసూదనాచారి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఢిల్లీ ధర్నాలో ఇండియా కూటమిని ఏకం చేస్తామని అన్నారని, మరి ఆ కూటమి సభ్యులు ధర్నాకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. బీసీల జపం చేసే రాహుల్‌గాంధీ బీసీ ధర్నాకు ఎందుకు రాలేదని నిలదీశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించకుంటే బీసీల సత్తా ఏమిటో చాటి చెప్తామని మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ హెచ్చరించారు. ఢిల్లీ ధర్నాకు సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గే ఎందుకు రాలేదని ప్రశ్నించారు.
రేవంత్ ప్రభుత్వం గవర్నర్‌కు పంపిన ఆర్డినెన్స్ కాపీలో చేర్చింది రాజకీయ రిజర్వేషన్ల అంశం మాత్రమేనని, విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశం అందులో లేనేలేదని మాజీ మంత్రి వీ శ్రీనివాసగౌడ్ విమర్శించారు. కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, మాజీ మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎంపీ బడుగల లింగయ్యయాదవ్, జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, బీఆర్ఎస్ నేత వకుళాభరణం కృష్ణమోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.