కాచిగూడ, డిసెంబర్ 29: బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచకుండా తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే యుద్ధం జరిగి తీరుతుందని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం వెంకటేశ్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ కాచిగూడలోని అభినందన్ హోటల్లో సంఘం రాష్ట్ర స్థాయి సమావేశంలో ఆర్ కృష్ణయ్య మాట్లాడారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లను పెంచుతామని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ప్రకటించారని, ఎన్నికల సభల్లో ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ, టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి హామీలు గుప్పించారని తెలిపారు. తీరా పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్నా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని తెలిపారు. తక్షణమే రిజర్వేషన్ల పెంపు ప్రక్రియను చేపట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీసీ నేతలు డాక్టర్ ఆర్ అరుణ్‌కుమార్, గుజ్జ సత్యం, అంజి, జీ మల్లేశ్, అనంతయ్య, వేముల రామకృష్ణ, రాజేందర్, ఉదయ్‌నేత, రమాదేవి, మోదీ రామ్‌దేవ్, వీరన్న, జయంతిగౌడ్, రఘుపతి, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.