హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): బీసీ రిజర్వేషన్లను పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆర్ కృష్ణయ్య నేతృత్వంలోని బీసీ నేతలు మంగళవారం సచివాలయంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కతో భేటీ అయ్యారు. ప్రభుత్వం జూన్ నెలాఖరులో స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుతామని ప్రకటించిందని గుర్తు చేశారు. కులగణన చేసిన తర్వాత దాని ఆధారంగా బీసీ రిజర్వేషన్లను పెంచాల్సి ఉంటుందని, దీనికే రెండు నెలల గడువు పడుతుందని తెలిపారు. ఈ ప్రక్రియను ఇంకా ప్రారంభించనేలేదని, రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా జరుపుతారని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టో ప్రకారం బీసీ రిజర్వేషన్ల సంఖ్యను 20 శాతం నుంచి 42 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో చట్టం చేసి బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచవచ్చని సూచించారు. అవసరమైతే అన్ని పార్టీలు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాయని తేల్చి చెప్పారు. కులాల వారి లెకలు సేకరించిన తర్వాత విద్యా, ఉద్యోగాల రిజర్వేషన్లను 29 శాతం నుంచి జనాభా ప్రకారం 50 శాతానికి పెంచుతామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ అంటున్నారని గుర్తు చేశారు. విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లపై ఉన్న క్రీమీలేయర్ తొలగించాలని కోరారు. ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్న హామీ మేరకు మరో 40 కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని, ప్రస్తుతం ఉన్న 11 ఫెడరేషన్లను కార్పొరేషన్లుగా మార్చాలని కోరారు. తమ డిమాండ్లపై మంత్రి సానుకూలంగా స్పందించారని బీసీ నేతలు తెలిపారు. ఈ భేటీలో సంఘం నేతలు గుజ్జ కృష్ణ, నీలం వెంకటేశ్, అంజి, బాలస్వామి, వెంకటేశ్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.