యాదగిరిగుట్ట, డిసెంబర్ 25 : జనాభా దామాషా ప్రకారం బీసీలకు 60 శాతం రిజర్వేషన్ అమలు చేసి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన కుటుంబ సమేతంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నల్లగొండ డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. హైకోర్టుకు వెళ్లి రిజర్వేషన్లు నిలుపుదల చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు అనుమానాలు వస్తున్నాయని తెలిపారు. కోర్టులో కేసులు ఉన్నాయని తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వంద శాతం రుణమాఫీ చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వామివారిపై ఒట్టువేసి రైతులను మోసం చేశారని మండిపడ్డారు. వందశాతం రుణమాఫీ అమలు చేసిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు గ్రామాల్లో 10 శాతం మాత్రమే రుణమాఫీ అయ్యిందని తెలిపారు. రైతుభరోసా పేరిట రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రైతులను మోసం చేస్తున్నదని విమర్శించారు.
రైతులకు ఇప్పటివరకు రూపాయి కూడా రైతుబంధు ఇవ్వకపోవడం దారుణమని అన్నారు. దేవుడి దగ్గర వివక్ష ఉండకూడదని, యాదగిరిగుట్టకు రూపాయి కూడా కేటాయించకపోవడం సరికాదన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని మన్నెంకొండ ఆలయం వద్ద రోప్‌వే, సకల వసతులు కల్పించడంలో ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. ఈ కారు రేస్ విషయంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కేటీఆర్‌పై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసే కుట్ర చేస్తుందని శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. కారు రేస్ వ్యవహారంలో అసెంబ్లీలో చర్చించే దమ్ములేక సర్కార్ తోకముడిచారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సినీ నటుడు అల్లు అర్జున్‌పై కక్షసాధింపు చర్యలకు పూనుకున్నదని ఆరోపించారు. సంధ్య థియేటర్ ఘటనపై పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. సినిమా ఇండస్ట్రీని ఆంధ్రాకు తరలించే ప్రయత్నంలో ప్రభుత్వం ఉండటం దురదృష్టకరమని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఉన్న ఏ చిన్న పరిశ్రమ తరలిపోయినా ఊరుకోబోమని హెచ్చరించారు.