హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): ‘42% బీసీ రిజర్వేషన్ అమలులో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. రిజర్వేషన్ల సాధనకు తెలంగాణ ఉద్యమ తరహాలో బీఆర్ఎస్ పార్టీ మరో పోరాటానికి శ్రీకారం చుడుతుంది. దీనికోసం శ్రేణులు సన్నద్ధం కావాలి’ అని బీఆర్ఎస్ బీసీ నేతలు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఉద్యమ కార్యాచరణపై సమాలోచనలు జరిపారు. కరీంనగర్లో ఆగస్టు 8న బీసీ బహిరంగసభతో బీసీ ఉద్యమ కార్యాచరణకు శ్రీకారం చుడుతున్నట్టు ప్రకటించారు.
హైదరాబాద్ తెలంగాణ భవన్లో శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, గంగుల కమలాకర్, వీ శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటైన బీసీ నేతల సమావేశంలో ఆ పార్టీ అగ్రనేత కేసీఆర్ ఆదేశాల మేరకు సంయుక్తంగా నిర్ణయం తీసుకున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం మీడియాతో మధుసూదనాచారి, తలసాని శ్రీనివాసయాదవ్, గంగుల కమలాకర్, వీ శ్రీనివాసగౌడ్, ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ మాట్లాడారు.
ఆర్డినెన్స్, జీవో ద్వారా రిజర్వేషన్లు సాధ్యం కాదని తెలిసినా, కాంగ్రెస్ పాలకులు వచ్చే నెల 5, 6,7 తేదీల్లో ఢిల్లీలో హైడ్రామాకు తెరలేపారని, చివరకు ఉత్త చేతులతోనే రాష్ట్రానికి తిరిగొస్తారని బీఆర్ఎస్ నేతలు జోస్యం చెప్పారు. ఈ మేరకు వచ్చి రాగానే క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి, స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలపై తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.
చివరాఖరుకు బీసీలకు కేవలం రాజకీయ రిజర్వేషన్లు కట్టబెట్టి చేతులు దులుపుకోవాలన్న ముందస్తు వ్యూహంతోనే కాంగ్రెస్ డ్రామాలాడుతున్నదని మండిపడ్డారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ కదన రంగంలోకి దూకిందని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేదాకా కాంగ్రెస్ సర్కారును వదలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లి, రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి వినితపత్రం ఇవ్వనున్నామని, ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్లు లేకుండా స్థానిక ఎన్నికలు నిర్వహించవద్దని కాంగ్రెస్ సర్కారుకు అల్టిమేటం ఇచ్చారు.
బీసీ రిజర్వేషన్ల కోసం ఏర్పాటుచేసిన డెడికేటెడ్ కమిషన్ రిపోర్టును రాష్ట్ర శాసనసభ, శాసనమండలిలో ఎందుకు ప్రవేశపెట్టలేదని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ కాంగ్రెస్ సర్కారును ప్రశ్నించారు. పైగా చట్ట వ్యతిరేంగా ఆ నివేదికను ఏఐసీసీ నేతలకు షేర్ చేస్తున్నారని వెల్లడించారు. బీసీల విషయంలో తాము తప్పులు చేశామని ఆ పార్టీ అధినేత రాహుల్ ఒప్పుకుంటున్నారని, వాస్తవంగా వారు చేసింది చాలా పెద్ద తప్పు అని స్పష్టం చేశారు.
42% రిజర్వేషన్లు కల్పించేంత వరకు బీసీలు ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రచార యావే తప్ప.. బీసీ బిల్లుల అమలుపై చిత్తశుద్ధి లేదని దుయ్యబట్టారు. రిజర్వేషన్ల బిల్లు ఢిల్లీకి పంపిన 3 నెలల్లో ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు. రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి కలిసి వినతి పత్రాలు ఇవ్వకుండా.. పార్టీ అధ్యక్షులను కలిస్తే ఏం లాభం జరుగుతుందని ప్రశ్నించారు.
‘బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేంత వరకు కాంగ్రెస్ పాలకులు రాష్ట్రానికి తిరిగి రావొద్దు. తమిళనాడు తరహాలో రిజర్వేషన్ల కోసం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత అనుసరించిన విధానాన్ని, ఇప్పుడు కాంగ్రెస్ పాలకులు అనుసరించి, 42% రిజర్వేషన్లతో రాష్ట్రానికి తిరిగి రావాలి’ అని మాజీ మంత్రి గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. జయలలిత మాదిరిగానే అవసరమైన రిజర్వేషన్లు కల్పించేంత వరకు అక్కడి నుంచే పాలన సాగించాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే బీసీలను మోసం చేయడం అని ధ్వజమెత్తారు. బీసీలకు ముఖ్యమంత్రి పదవి చేపట్టే అవకాశం వచ్చినా, కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇవ్వలేదని దుయ్యబట్టారు.
కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ బీసీల ఓట్లను కొల్లగొట్టి, అధికారంలోకి వచ్చిన తర్వాత వారినే మోసం చేసిందని మండిపడ్డారు. ఒక్కొక్క పార్లమెంట్ సెగ్మెంట్లో బీసీలకు 2 అసెంబ్లీ స్థానాల్లో పోటీకి అవకాశం ఇస్తామని చెప్పిన కాంగ్రెస్.. చివరకు మోసం చేసిందని మండిపడ్డారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక్క అసెంబ్లీ స్థానం కూడా బీసీ నేతకు ఇవ్వలేదని నిప్పులు చెరిగారు. ఆర్డినెన్స్, జీవోల ద్వారా బీసీ రిజర్వేషన్లు రావాలని బీఆర్ఎస్ గతంలోనే స్పష్టంగా చెప్పిందని గుర్తు చేశారు. బీసీ రిజర్వేషన్ల అమలు కోసం సీఎం రేవంత్‌రెడ్డి ఒక్క రోజైనా ప్రధాని మోదీని కలిశారా? అని నిలదీశారు.
ఇచ్చిన హామలను అమలు చేయకుండా బీసీలను అణగదొక్కుతామంటే ఎట్టి పరిస్థితిల్లో ఊరుకునేది లేదు అని మాజీ మంత్రి శ్రీనివాసగౌడ్ హెచ్చరించారు. బీసీ నేతలకు ప్రాధాన్యం లేని పదవులు ఇచ్చి, ప్రాధాన్యం కలిగిన పదవులను అగ్రకులాల నేతలకు ఇచ్చారని ఆరోపించారు. ఆదాయం ఉన్నచోట అగ్రకులాల నేతలకు పదవులు దక్కాయని, తిట్లు తినే దగ్గర బీసీలకు పదవులు ఇచ్చారని ఆరోపించారు. బీసీలను నిత్యం మోసగిస్తూ, దేశానికే ఆదర్శమని ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు. కేంద్రంలోప్రధానిగా బీసీ నేత ఉన్నప్పటికీ, బీసీలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటుచేయక పోవడం బాధాకరమని పేర్కొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు లభిస్తేనే, వారికి రాజకీయ ప్రాతినిధ్యం వస్తుందని చెప్పారు.
బీసీల పట్ల కాంగ్రెస్ సర్కారు అవలంబిస్తున్న కుటిలత్వాన్ని ప్రజాక్షేత్రంలో ఎప్పటికప్పుడు ఎండగడుతామని సిరికొండ మధుసూదనాచారి హెచ్చరించారు. శాసనసభతోపాటు శాసనమండలిలో లోపాలను ఎత్తి చూపుతూనే.. బీసీ బిల్లుకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించామని, అయినా ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. బీసీలను మొదటి నుంచి మోసం చేస్తూనే వస్తున్నదని ధ్వజమెత్తారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అమలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అభాసు పాలవుతుందని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
బీసీలకు గంభీరమైన హామీ ఇచ్చి, దానిని అమలుచేసే క్రమంలో దారితెన్నూ లేని విధానాలను అవలంబిస్తూ.. సర్కారు ఏ విధంగా అభాసుపాలవుతుందో అన్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. బీసీల అభివృద్ధి, వారి అభ్యున్నతితోపాటు వారికి న్యాయం చేస్తామన్న కాంగ్రెస్ నేతల మాటలు వింటుంటే.. దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నదని మండిపడ్డారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి బీసీలపై చిత్తశుద్ధి ఉంటే, ఆ పార్టీ అధికారంలో ఉన్న మూడు రాష్ర్టాల్లో బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీలకు మాటిచ్చిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు పలు రకాలుగా పిల్లి మొగ్గలు వేస్తున్నారని విమర్శించారు. బీసీలకు న్యాయం జరిగేంత వరకు, కాంగ్రెస్ పార్టీ కుటిలత్వాన్ని ఎండగడుతూనే ఉంటామని హెచ్చరించారు. బీసీలకు ఎప్పటికీ రక్షణ కవచంగా బీఆర్ఎస్ ఉంటుందని స్పష్టం చేశారు.
42% బీసీ రిజర్వేషన్లను అమలు చేశాకే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ డిమాండ్ చేశారు. ఆర్డినెన్స్ ద్వారా బీసీ రిజర్వేషన్లు సాధ్యం కాదని తెలిసినా, ఢిల్లీకి వెళ్తున్నట్టు ప్రకటించారు, కానీ, చివరకు వారు ఉత్త చేతులతోనే తిరిగొస్తారని ఎద్దేవా చేశారు. బీసీ రిజర్వేషన్ల కోసం వచ్చే నెల 5,6,7 తేదీలలో ఢిల్లీలో హైడ్రామాలు ఆడబోతున్నారని, చివరకు రిజర్వేషన్లు ఇవ్వడం లేదని, కేంద్ర ప్రభుత్వంపై, ఇటు బీఆర్ఎస్పై నెపం వేయడం కోసం కుటిల పన్నాగాలు పన్నుతున్నారని మండిపడ్డారు.
వచ్చే నెల 8న కరీంనగర్లో జరిగే బీసీ సభతో 42 శాతం రిజర్వేషన్ల అమలుపై కాంగ్రెస్ సర్కార్‌పై ఒత్తిడి చేస్తామని స్పష్టంచేశారు. ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతిని కలుస్తామని తెలిపారు. ఈ అంశంపై కాంగ్రెస్, బీజేపీ కలిసే నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. ఎన్నికలకు వెళ్తే ప్రజలు కాంగ్రెస్, బీజేపీని తరమికొట్టడం ఖాయమని స్పష్టం చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బీసీ బిల్లు ఆమోదం కోసం రాష్ట్రపతికి పంపిన తర్వాత, దానికి పరిష్కారం లభించకుండానే, ఆర్డినెన్స్‌ను ఎలా తీసుకొస్తారని సూటిగా ప్రశ్నించారు. ఖాళీగా ఉన్న మూడు మంత్రి పదవులను బీసీలకు ఇవ్వాలని, కార్పొరేషన్ పదవుల్లో 50 శాతం బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.