హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీచేయాలని కాంగ్రెస్ సర్కారు నిర్ణయించింది. ఒకటి రెండు రోజుల్లో జీవో వెలువడనున్నట్టు తెలిసింది. 2024 కులగణన సర్వే ప్రాతిపదికన బీసీలకు 42 శాతం రిజర్వేషన్, ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెకల ప్రకారం రిజర్వేషన్లు కేటాయించాలని పంచాయతీరాజ్‌శాఖ అధికారులకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి. అయితే, రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఉన్నందున, అందుకు విరుద్ధంగా 50 శాతానికిపైగా రిజర్వేషన్లు పెంచుతూ రేవంత్‌రెడ్డి సర్కారు ఇచ్చే జీవో న్యాయస్థానంలో నిలవదని న్యాయనిపుణులు చెప్తున్నారు. ఎవరైనా రిజర్వేషన్ల జీవోను సవాల్ చేస్తూ కోర్టుకు వెళితే.. వారిపైనే నిందలేయాలని, తాము రిజర్వేషన్లు ఇవ్వాలని చూసినా కొందరు కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారని కాంగ్రెస్ పెద్దలు గాయిగాయిచేసి చేతులు దులుపుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం.
ఒకటి రెండ్రోజుల్లో జీవో
జిల్లాల కలెక్టర్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు, జిల్లా పంచాయతీ అధికారులతో ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు.. మంగళవారం సాయంత్రంలోగా స్థానిక సంస్థల రిజర్వేషన్లు రఫ్‌గా పూర్తిచేయాలని ఆదేశించారు. వాటిని అధికారులు ఎవరూ లీక్ చేయవద్దని, ప్రభుత్వం జీవో ఇచ్చిన రిజర్వేషన్ల స్థానాలను వెల్లడించాలని సూచించారు. ఒకటి రెండ్రోజుల్లో (బుధ, గురువారాల్లో) రిజర్వేషన్ల జీవో ఇవ్వాలని సర్కారు భావిస్తున్నట్టు తెలిసింది. ఒకరోజు గ్రామ పంచాయతీ, వార్డులపై, మరోరోజు ఎంపీటీసీ, ఇంకోరోజు జడ్పీటీసీ ఇలా.. రెండు మూడు రోజుల్లోనే రిజరేషన్లపై రాజకీయ పార్టీల నుంచి అభ్యంతరాలు స్వీకరించాలని చూస్తున్నది. దసరాకు అటూఇటుగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ద్వారా షెడ్యూల్ ప్రకటన చేయించాలని భావిస్తున్నట్టు అధికారవర్గాలు తెలిపా యి. అయితే, సెప్టెంబర్ 30లోగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని గతంలో హైకోర్టు ఆదేశించింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించామని, నెల రోజుల్లో పూర్తిచేస్తామని రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థానానికి విన్నవించుకోవడానికి వెసులుబాటు ఉంటుందని చెప్తున్నాయి.
సర్కారువి అన్నీ డ్రామాలే: విపక్షాలు
తెలంగాణలో బీసీ రిజర్వేషన్ అంశంపై కాంగ్రెస్ డ్రామాలు ఆడుతున్నదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. స్థానిక ఎన్నికలను ఎదుర్కోలేక 42 శాతం బీసీ రిజర్వేషన్ల పేరుతో రేవంత్‌రెడ్డి సర్కారు కాలయాపన చేస్తున్నదని విమర్శిస్తున్నాయి. బీసీలకు 2024 కులగణన సర్వే, ఎస్సీ, ఎస్టీలకు మాత్రం 2011 జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించడం ఏమిటని విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి హైబ్రిడ్ రిజర్వేషన్ విధానం గతంలో తామెన్నడూ చూడలేదని కొందరు అధికారులు సైతం పెదవి విరుస్తున్నారు. ఈ పద్ధతి వల్ల ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లలో ఒక శాతం స్థానాలు తగ్గుతాయని ఆయావర్గాలు వాపోతున్నాయి.
తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చినట్టు బీహార్ ఎన్నికల్లో ప్రచారం చేసుకొని లబ్ధిపొందడం కోసం కాంగ్రెస్ సర్కారు కొత్త డ్రామాకు తెరతీసిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదిలాఉండగా, పంచాయతీరాజ్, మున్సిపల్ (స్థానిక సంస్థలు) ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్ పరిమితిని ఎత్తివేస్తూ అసెంబ్లీ ఆమోదించిన బిల్లు ఇంకా గవర్నర్ వద్ద పెండింగ్‌లోనే ఉన్నది. రాజకీయాలతోపాటు విద్య, ఉద్యోగ అంశాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్ర క్యాబినెట్లో తీర్మానించి, ఉభయసభల్లో ఆమోదించిన రెండు బిల్లులను గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపించారు. నాలుగు నెలలు అవుతున్నా వాటిని రాష్ట్రపతి ఆమోదించలేదు, తిరిగి పంపలేదు. ఇవన్నీ కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉండగా, ఇప్పుడు జీవో ద్వారా మరో నాటకానికి కాంగ్రెస్ సర్కారు తెరలేపిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
బీసీలకు 10 శాతం పెరుగనున్న సీట్లు
రాష్ట్రంలో మొత్తం 31 జడ్పీలు, 565 జడ్పీటీసీ స్థానాలు, అదే సంఖ్యలో ఎంపీపీ స్థానాలు, 5,763 ఎంపీటీసీ స్థానాలు, 12,760 గ్రామ పంచాయతీలు, 1,12,534 పంచాయతీ వార్డులు ఉన్నాయి. జనాభాతోపాటు గతంతో పోలిస్తే బీసీ రిజర్వేషన్ కూడా పెరిగినందున సీట్ల సంఖ్య కూడా పది శాతం మేరకు పెరిగింది. 2011 జనాభా లెక్కల ప్రకారమే ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు ఖరారు కానున్నందున ఇప్పటి జనాభాతో పోలిస్తే వారికి 10 శాతం సీట్లు తగ్గుతాయని ఆయా వర్గాలు ఆరోపిస్తున్నాయి. జనరల్ స్థానాలు కూడా సగానికి తగ్గే అవకాశం ఉంటుందని అధికారులు చెప్తున్నారు. రిజర్వేషన్లు పెరిగినందున జనరల్ స్థానాలు బీసీలకు చెందుతాయని అంటున్నారు. పాత జనాభా ప్రకారమే ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ కల్పిస్తున్నందున గతంలో వారికి ఉన్న సంఖ్య పెద్దగా మారకపోవచ్చని చెప్తున్నారు.
ఇక మిగిలింది ఏడు రోజులే..
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు విధించిన గడువు దగ్గర పడింది. ఇక ఏడు రోజులు మాత్రమే మిలిగింది. ఇప్పటివరకు రిజర్వేషన్లను సైతం సర్కారు కొలిక్కి తీసుకురాలేకపోయింది. హైకోర్టు విధించిన డెడ్‌లైన్
(సెప్టెంబర్ 30) లోపల ఎన్నికలు నిర్వహించడం అసాధ్యం. ఇప్పటికీ ఎన్నికల నిర్వహణ పరిస్థితి గాలిలో దీపంలాగే ఉంది. రిజర్వేషన్ల వ్యవహారంలో ఒక పద్ధతి లేకుండా ఇష్టమొచ్చినట్టుగా, అశాస్త్రీయంగా వ్యవరిస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. న్యాయస్థానంలో నిలవకపోయినా రెండ్రోజులు రిజర్వేషన్ల జీవో ఇచ్చి కోర్టుకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభించామని చెప్పాలని రేవంత్‌రెడ్డి సర్కారు భావిస్తున్నది. మరింత సమయం కావాలని హైకోర్టును కోరాలని యోచిస్తున్నది. అయితే, ప్రభుత్వ వినతిని హైకోర్టు స్వీకరిస్తుందా? తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతాయి? అనేది ఆసక్తికరంగా మారింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో వివిధ సామాజిక వర్గాలకు దకే స్థానాల వివరాలు (అంచనా)