హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సస్పెన్స్ ఇప్పట్లో వీడే పరిస్థితి కనిపించడం లేదు. హైకోర్టు ఆదేశించినట్టుగా ఈ నెల 30లోగా నిర్వహించలేమనే నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చినట్టు తెలిసింది. ఏడాదిన్నరగా ఎన్నికలను వాయిదా వేస్తూ వస్తున్న రేవంత్‌రెడ్డి సర్కారు.. మరికొంతకాలం ఆగాలని డిసైడ్ అయినట్టు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా యూరియా కొరత రైతులను వేధిస్తున్న క్రమంలో ఇప్పుడు స్థానిక ఎన్నికలకు వెళ్తే ఆ ప్రభావం ప్రతికూలంగా ఉంటుందని, ఫలితంగా ఓడిపోతామనే భయం కాంగ్రెస్ శ్రేణుల నుంచి అధిష్ఠానానికి అందినట్టు తెలిసింది. అయితే, స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులు గవర్నర్, రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అసెంబ్లీలో చేసిన ఏకగ్రీవ తీర్మానం మేరకు రాష్ట్రపతి, గవర్నర్ నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని సర్కారు ఆశిస్తున్నది. ఇదే అంశాన్ని హైకోర్టుకు విన్నవించి ఎన్నికలను మరికొంతకాలం వాయిదా వేసేందుకు అనుమతించాలని కోరే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఒకటి రెండు రోజుల్లో కోర్టు అనుమతితో స్థానిక పోరు విషయంలో ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనున్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం.
రాష్ట్రంలో 2024 ఫిబ్రవరి, జూన్లలో స్థానిక సంస్థల పాలకవర్గాల గడువు ముగిసింది. నాటినుంచి అంటే సుమారు 19 నెలలుగా కొత్త కార్యవర్గాలు ఎన్నిక కాకపోవడంతో కేంద్రం నుంచి, 15వ ఆర్థిక సంఘం నిధులు రాకుండాపోయాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్రామాలకు ఎలాంటి నిధులు కేటాయించడంలేదు. దాంతో గ్రామీణ ప్రాంతాలు సమస్యల వలయంలో చిక్కుకున్నాయి. కనీసం బ్లీచింగ్ పౌడర్ కొనలేని, చెత్త సేకరించే ట్రాక్టర్లకు డీజిల్ కొట్టించలేని దుస్థితికి గ్రామాలు చేరుకున్నాయి. గ్రామాలు గబ్బుకొట్టే దుస్థితి దాపురించింది. ఓటమి భయంతోనే కాంగ్రెస్ సర్కారు స్థానిక ఎన్నికల ఊసే ఎత్తడంలేదన్న ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో పలువురు సర్పంచ్‌లు హైకోర్టును ఆశ్రయించారు. వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని విజ్ఞప్తిచేశారు. సెప్టెంబర్ 30వ తేదీలోగా ఎన్నికలు నిర్వహించాలని మూడు నెలల క్రితం హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది.
హైకోర్టు డెడ్‌లైన్ విధించడంతో కాంగ్రెస్ సర్కారుకు ఎన్నికల నిర్వహణ తప్పనిసరిగా మారింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాల్సిన అనివార్యత ఏర్పడింది. బీసీల రిజర్వేషన్‌పై హడావుడి ఆర్డినెన్స్ తెచ్చి రాష్ట్రపతికి పంపించింది. అది ఆమోదానికి నోచుకోకపోవడంతో ఢిల్లీలో ధర్నా పేరుతో కొంత హంగామా చేసింది. అర్డినెన్స్ అలా ఉండగానే, తాజాగా ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి బీసీ రిజర్వేషన్ బిల్లు పాస్ చేసింది. దానిని గవర్నర్‌కు పంపించింది. ఈ రెండు చర్యలు సఫలం కావని ముందే తెలిసినప్పటికీ కాలం గడుపాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇలా చేసిందని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. ప్రభుత్వం తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి బీసీ బిల్లులను సాకుగా వాడుకుంటున్నదని గులాబీ నేతలు ఆరోపిస్తున్నారు.
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా రైతులను తీవ్రంగా యూరియా కొరత వేధిస్తున్నది. అర్ధరాత్రి నుంచి లైన్లలో నిలబడినా బస్తా యూరియా దొరకడం లేదు. రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం మీద పీకలదాకా కోపంగా ఉన్నారు. ఈ తరుణంలో ఎన్నికలు నిర్వహిస్తే రైతులను నెత్తినపెట్టున్న బీఆర్ఎస్కే ఓట్లు పడతాయనే అభిప్రాయం క్షేత్రస్థాయి పార్టీ వర్గాల నుంచి కాంగ్రెస్ పెద్దలకు సమాచారం అందింది. ‘యూరియా సమస్య పరిషరించకుండా ఎన్నికలకు వెళ్లడం ప్రమాదకరం’ అని అధిష్ఠానం చెప్పినట్టు సమాచారం. ఈ క్రమంలోనే హైకోర్టును ఆశ్రయించి మరింత గడువు కోరాలని చూస్తున్నట్టు తెలిసింది. ముందు ఒక నెల, ఆ తర్వాత దసరా పండుగ పేరుతో మరో నెల రోజులు పొడిగించాలనే యోచనలో రేవంత్ సర్కారు ఉన్నట్టు తెలిసింది. మొత్తంగా గ్రామీణ ప్రాంతాల ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత కాస్త చల్లారిన తర్వాత ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తున్నట్టు సమాచారం.
ప్రభుత్వం అనుకున్నది అనుకున్నట్టుగా జరిగినా ఈ నెల 30వ తేదీలోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని అధికారులు చెప్తున్నారు. ప్రభుత్వం ఆశించినట్టుగా రెండు మూడు రోజుల్లో గవర్నర్ నుంచి సానుకూల స్పందన వచ్చినా, బీసీలకు 42 శాతం, ఇతర వర్గాలకు నిర్దేశించిన రిజర్వేషన్లు స్థిరీకరించడానికి కనీసం 10-15 రోజుల సమయం పడుతుంది. ఈ ప్రక్రియ అనంతరం ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు జీవో ఇస్తుంది. ఆ తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ విడుదల వంటి ప్రక్రియలు ఉంటాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఎన్ని విడుతల్లో నిర్వహించాలనే దానిని బట్టి సమయం పెరుగుతుంది. ఇదంతా ఈ నెలాఖరు వరకు జరిగే పరిస్థితి లేనందున ప్రభుత్వం గడువు కోరాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది.