హైదరాబాద్, ఫిబ్రవరి10 (నమస్తే తెలంగాణ): రాజకీయంగా అణచివేసేందుకే బీసీల గణాంకాలను తారుమారు చేసి నయవంచనకు గురిచేసిందని సర్వాయిపాపన్న మోకుదెబ్బ గౌడ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు జకే వీరస్వామిగౌడ్ ఒక ప్రకటనలో విమర్శించారు. ఇంటింటి సర్వేను తప్పుల తడకగా నిర్వహించిందని ధ్వజమెత్తారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను కాపాడేందుకే బీసీలను బలి పశువులను చేస్తున్నదని మండిపడ్డారు. సమగ్ర కులగణనలో బీసీలు కేవలం 46.25 శాతమే ఉన్నట్టు చూపడం దగా చేయడమేనని పేర్కొన్నారు.
జాతీయ నివేదికలు బీసీల జనాభా 52 శాతానికి పైగా ఉన్నట్టు రుజువు చేశాయని తెలిపారు. రాష్ట్ర జనాభా వాస్తవికంగా 4 కోట్లకు పైగా ఉండగా, సర్వేలో 3.70 కోట్లే ఉన్నట్టు ప్రభుత్వం తేల్చడం అన్యాయమని విమర్శించారు. ఒక గ్రేటర్ హైదరాబాద్లోనే గౌడ జనాభా దాదాపు 5 లక్షల వరకు ఉంటుందని తేల్చిచెప్పారు. ఇప్పటికైనా సర్వే తప్పులను సవరించాలని డిమాండ్ చేశారు. లేదంటే కాంగ్రెస్ పార్టీకి భంగపాటు తప్పదని వీరస్వామిగౌడ్ స్పష్టంచేశారు.