హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): ఎన్నెన్నో మహోద్యమాలకు పాదువేసిన జలదృశ్యం ప్రదేశం నుంచి బీసీల ఉద్యమకొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహం సాక్షిగా బీసీ కవులు, రచయితలు, విద్యావేత్తలు బీసీల హకుల సాధన ఉద్యమానికి తమ కలాలను పదునెకిస్తామని ప్రతిజ్ఞ చేశారు. త్వరలో బీసీ కవులు, రచయితల మహాసమ్మేళనాన్ని హైదరాబాద్‌లో నిర్వహించి బీసీ సాహిత్య, సాంస్కృతిక ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని బీసీ సాహితీవేత్తలు నిర్ణయించారు.
కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలుకు సాహిత్య, సాంస్కృతిక రంగం క్రియాశీలక పాత్ర పోషించాలని తీర్మానించారు. కర్పూరీ ఠాకూర్ 102వ జయంతిని పురస్కరించుకుని జూలూరు గౌరీశంకర్ సంపాదకత్వంలో వెలువడిన ‘జననాయక’ కర్పూరీ ఠాకూర్‌పై కవితా సంకలనం, ‘జన నాయక్ కర్పూరీ ఠాకూర’పై వ్యాససంకలనం పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం ట్యాంక్‌బండ్‌పై కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహంవద్ద శనివారం నిర్వహించారు. రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్, లాల్‌నీల్ రూపకర్త, సామాజిక ఉద్యమకారుడు జీ రాములు పుస్తకాలను ఆవిషరించారు.
బీసీల హకుల రిజర్వేషన్లను తొలిసారిగా అమలు చేయడం వల్లే కర్పూరీ ఠాకూర్ పదవి కోల్పోవాల్సి వచ్చిందని జస్టిస్ చంద్రకుమార్ గుర్తుచేశారు. పదవికోసం తన ఆలోచనల్ని ఏనాడు మార్చుకోలేదని, తెలంగాణ సమాజంలోనూ ప్రత్యామ్నాయం కోసం బీసీలు, ప్రగతిశీలవాదులంతా ఏకంకావాలని కోరారు. తెలంగాణ మహాసభ, ఎన్నెన్నో అస్తిత్వ ఉద్యమాల చర్చలకు, కేసీఆర్ తెలంగాణ అస్తిత్వ జెండాఎత్తిన తదితర ఎన్నో చారిత్రక మలుపులకు కేంద్రమైన జలదృశ్యం నుంచే కవులు, రచయితలు ప్రతిజ్ఞ తీసుకోవడం బీసీ సాహిత్య ఉద్యమానికి మలుపు అవుతుందని జూలూరు గౌరీశంకర్ వివరించారు.
కార్యక్రమంలో ప్రఖ్యాత సాహిత్య విమర్శకుడు సంగిశెట్టి శ్రీనివాస్, ప్రముఖ కవి వనపట్ల సుబ్బయ్య, ప్రఖ్యాత రచయిత జ్వలిత, అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కార్యదర్శి రాపోలు సుదర్శన్, బీసీ ఆలోచనావేదిక వ్యవస్థాపకుడు కటకం నర్సింహారావు, హైకోర్టు న్యాయవాది జెల్లి సిద్ధయ్య, సాహిత్య విమర్శకుడు హెచ్ రమేశ్‌బాబు, తెలంగాణ పబ్లికేషన్స్ అధినేత కోయ చంద్రమోహన్, రచయిత ఎదిరేపల్లి కాశన్న, అడ్వకేట్ అన్నభీమోజు నాగార్జునాచారి, కవులు, రచయితలు తదితరులు పాల్గొన్నారు.