పెద్దపల్లి కమాన్/ సిరిసిల్ల టౌన్/కరీంనగర్ తెలంగాణచౌక్, నవంబర్ 6 : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల లక్ష్య సాధనలో భాగంగా రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపు మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బీసీ సంఘాల నాయకులు, కార్యకర్తలు చేపట్టిన మౌన దీక్ష విజయవంతమైంది. వీరికి పలువురు సంఘీభావం తెలిపారు. పెద్దపల్లిలో బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష ఆధ్వర్యంలో దీక్ష చేపట్టగా, పలువురు నోటికి నల్లగుడ్దలు కట్టుకుని సంఘీభావం ప్రకటించారు. సిరిసిల్లలోని అంబేద్కర్ చౌరస్తాలోగల జ్యోతిబా ఫూలే విగ్రహం వద్ద బీసీ నాయకులు నోటికి నల్ల రిబ్బన్లు ధరించారు.
ఇక్కడ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మాండ్లు పాల్గొన్నారు. కరీంనగర్లోని కోర్టు చౌరస్తాలో గల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలీ శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహించిన మౌన దీక్షకు జిల్లా అధ్యక్షుడు నాగుల కనుకయ్యగౌడ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ నెల 13 కలెక్టరేట్ ఎదుట ధర్మదీక్ష చేపడుతున్నట్టు తెలిపారు. శాతవాహన విశ్వవిద్యాలయం సాత్నకోత్సవానికి విచ్చేస్తున్న గవర్నర్ను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుచేయాల్సిందేనని డిమాండ్ చేశారు.