Congress | హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్కు రాజీనామా చేసిన పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యపై ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీలోని బీసీ నేతలు భగ్గుమంటారు. ‘40 ఏండ్లు అనుభవించి.. సిగ్గుండాలె. ఈ వయస్సులో పార్టీ మారడానికి.. సచ్చే ముందల ఏం రోగం వచ్చిందయ్యా ఆయనకు. ఏం తక్కువ చేసింది పార్టీ ఆయనకు. అన్ని ఇచ్చింది.. సిగ్గు ఉండొద్దు’ అని పొన్నాలపై ఢిల్లీలో రేవంత్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్లో ప్రకంపనలు సృష్టిస్తున్నది. పార్టీని వీడిపోతున్న సీనియర్నేతపై రేవంత్ వ్యాఖ్యలు ఆయన అగ్రవర్ణ కుల దురహాంకారానికి నిదర్శమని బీసీ నేతలు మండిపడుతున్నారు.. పొన్నాల రాజకీయ జీ వితం అంత వయస్సులేని రేవంత్ ‘సిగ్గు ఉం డొద్దు’ అంటారా? అని భగ్గుమంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ బీసీలను అణచివేస్తుందని, రేవంత్ పీసీసీ అధ్యక్షుడు అయినప్పటి నుంచి తన వర్గాన్ని మినహా తక్కిన వర్గాల వారిని.. పొమ్మనలేకపొగపెడుతున్నారనే విమర్శలు వ స్తున్నాయి. బీసీలకు పార్టీలో తగిన ప్రాధాన్యం ఇవ్వటం లేదన్న విమర్శలను సరిదిద్దుకోవాల్సిందిపోయి వారిపై రేవంత్ నోరుపారేసుకోవటాన్ని ఆ వర్గం నేతలు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. ఎన్నికల సమయంలో పార్టీ సీనియర్లను, అదీ పీసీసీ ప్రెసిడెంట్గా పనిచేసి సుదీర్ఘ రాజకీయ జీవితం ఉన్న పొన్నాల లక్ష్మయ్యపై రేవంత్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో దుమారం రేపుతున్నది. ఢిల్లీలో మీడియా ముందే రేవంత్ అలా రెచ్చిపోయి మాట్లాడితే ఇక నాలుగు గోడల మధ్య బీసీవర్గాల నేతలపై, పార్టీ సీనియర్ నాయకులపై ఆయన ఆధిపత్యం ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చని పేరుచెప్పటానికి నిరాకరించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. రేవంత్ కేవలం పొన్నాలను మాత్రమే అవమానించలేదని, కాంగ్రెస్ పార్టీలోని సమస్త బీసీ నాయకులను, బీసీ క్యాడర్ ఆత్మగౌరవాన్ని కించపరిచారని మండిపడుతున్నారు.