రవీంద్రభారతి, డిసెంబర్ 13: బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అంశంలో కాంగ్రెస్, బీజేపీ నయవంచన చేశాయని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ మండిపడ్డాయి. శనివారం బషీర్‌బాగ్ దేశోద్ధారక భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు మాట్లాడారు. 42శాతం రిజర్వేషన్ల విషయంలో అన్ని పా ర్టీలు నోటితో మద్దతు తెలిపాయని చెప్పారు. కానీ చేతల వరకు వచ్చే సరికి రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు నయవంచనకు పాల్పడ్డాయని విమర్శించారు. 42శాతం రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాటను తప్పిందని ధ్వజమెత్తారు. 42 శాతం రిజర్వేషన్ల అంశాన్ని పక్కదారి పట్టించడానికి గ్లోబల్ రైజింగ్ సమ్మిట్, మెస్సీతో ఫుట్‌బాల్‌ను తెరపైకి సీఎం రేవంత్ తెచ్చారని మండిపడ్డారు. బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాల్‌రాజ్‌గౌడ్ మాట్లాడుతూ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమై 13 రోజులు కావస్తున్నా సభలో బీసీ రిజర్వేషన్ల గురించి ఇటు బీజేపీగానీ, అటు కాంగ్రెస్‌గానీ ఎందుకు ప్రస్తావించడం లేదని నిలదీశారు.